జనసేన అంటీ అంటనట్టు ఉందా? మోడీ, అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదనా?

Update: 2021-04-01 11:30 GMT
దేవుడు వరమిచ్చినా ‘పూజారి’ ఇవ్వలేదన్నట్టుగా ఉందట జనసేన పరిస్థితి. ఏపీలో బీజేపీ-జనసేన కూటమిలో ఇటీవల ఓ పెద్ద సంఘటన చోటుచేసుకుంది. కూటమి సీఎం అభ్యర్థిగా ‘పవన్ కళ్యాణ్’ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ఇంత చేసినా జనసేన అంటీ ముట్టనట్టుగా బీజేపీతో కలవకుండా ఉంటోందట.. ఏంటీ కారణం అని ఆరాతీస్తే అసలు విషయం వెలుగుచూసింది.

ఇటీవల తిరుపతి పార్లమెంట్ పై జరుగుతున్న సమీక్షల్లో బీజేపీ యాక్టివ్ రోల్ పోషిస్తుండగా.. జనసేన మాత్రం అంటీముట్టనట్టు వ్యవహరిస్తోందట.. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ ఇప్పటి వరకూ సమావేశాలు, సమీక్షలకే పరిమితమవుతూ వస్తోంది. ఇంతవరకు ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేపట్టడం లేదు. ఒకట్రెండు మండలాల్లో స్థానిక నేతలు, కార్యకర్తలు మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు మాత్రం సమావేశాలు, పరిచయ కార్యక్రమాలతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారు.

 బుధవారం పార్టీ అభ్యర్థి రత్నప్రభ తిరుపతిలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, పార్టీ రాష్ట్ర ఇంఛార్జి సునీల్‌ దియోధర్‌ తదితరులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈ ముగ్గురూ, ఎమ్మెల్సీ మాధవ్‌, పార్టీ ముఖ్యనేతలు శాంతారెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, కోలా ఆనంద్‌ తదితరులతో కలసి పార్టీ శ్రేణులతో జరిగిన పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంఛార్జి నగరం వినుత కూడా హాజరయ్యారు.

 మంగళవారం తిరుపతిలో జరిగిన బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశానికి నగర జనసేన అధ్యక్షుడు మినహా ముఖ్యనేతలెవరూ హాజరు కాలేదు. కేవలం తిరుపతిలోనే కాకుండా శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంతవరకూ ఉప ఎన్నికల కార్యక్షేత్రంలో కనిపించడంలేదు. సత్యవేడు మండలంలో స్థానిక నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

జనసేన నేతలు బీజేపీని నమ్మడం లేదని.. వారు పవన్ సీఎం అన్న మాట కేవలం తిరుపతి ఉప ఎన్నికల్లో క్యాష్ చేసుకోవడానికేనన్న అనుమానాన్ని జనసేన నేతలు వ్యక్తం చేస్తున్నారు.  పవన్ కళ్యాణ్ యే సీఎం అభ్యర్థి అని సోము వీర్రాజు చెబితే ఏం లాభం? రేపు మాకు ఏమీ తెలియదని.. అది అతడి వ్యక్తిగత అభిప్రాయం అని బీజేపీ హైకమాండ్ చేతులు ఎత్తేస్తే పరిస్థితి ఏందని జనసేన నాయకులు అంటున్నారు.

ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని.. తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా మోడీ హామీ ఇచ్చారు. గెలిచారు.. కానీ తర్వాత ఆ హామీని గాలికొదిలేశాడు. ప్రత్యేహోదా గురించి ఇలాగే బీజేపీ మాట తప్పింది. అందుకే బీజేపీ హైకమాండ్ నుంచి పూర్తిస్థాయిలో మాట వచ్చేంతవరకు జనసేన తిరుపతిలో పెద్దగా యాక్టివ్ కాదు అంటున్నారు జనసైనికులు. చూడాలి మరీ మోడీషాలు ‘పవన్ సీఎం’ అని ప్రకటన చేస్తారో లేదో.. 
Tags:    

Similar News