పవన్ కు సోదరుడిగా మాత్రమే.. పార్టీలో మాత్రం ఉండట్లేదా?

Update: 2021-10-01 11:30 GMT
బోలెడంత మంది అభిమానులు.. తెలుగుచిత్ర పరిశ్రమలో బలమైనసినీ కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఆ ఫ్యామిలీకి సంబంధించిన నటులు ఎవరికి వారు తమను తాము ఫ్రూవ్ చేసుకున్న వారే. చిరంజీవి పేరుతో ఇండస్ట్రీకి వచ్చినా.. ఎక్కువ కాలం ఆయన ఇమేజ్ మీద ఆధారపడకుండా.. తమదైన ఇమేజ్ ను సొంతం చేసుకోవటం కనిపిస్తూ ఉంటుంది. చిరంజీవి సోదరుడిగా.. నిర్మాతగా.. నటుడిగా సుపరిచితులైన మెగా బ్రదర్ నాగబాబు.. తన సోదరులు పెట్టే రాజకీయ పార్టీల్లో తన వంతు పాత్ర పోషిస్తుంటారు. కాకుంటే ఆయన తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది.

పార్టీలో ఉంటూ.. పార్టీ నేతగా అనిపించుకుంటూ ఉంటారు తప్పించి.. ప్రజలకు దగ్గరగా వెళ్లటంలో ఆయనలో తెలీని తడబాటు కనిపిస్తూ ఉంటుంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలోనూ ఆయన పార్టీలో ఉన్నట్లే ఉంటారు కానీ.. అంత ఎక్కువ పాత్ర పోషించలేదు. ప్రజారాజ్యంలో పదవి తీసుకోకున్నా ఆయన తనదైన పాత్ర పోషించారు. అనంతరం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో కలిపేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.

అనంతరం నాగబాబు సోదరుడు పవన్ కొత్త పార్టీ జనసేనను ఏర్పాటు చేసిన సమయంలో.. ఆయన ఆ వేదికకు దూరంగా ఉండిపోయారే. ఒకదశలో చిరంజీవి మాట వినకుండా పవన్ పార్టీ పెట్టిన నేపథ్యంలో పవన్ కు దూరంగా ఉండేవారు. మొదట్లో చిరుకు సన్నిహితంగా ఉన్న నాగబాబు.. తాను అన్నయ్య పక్షమేనని.. అభిమానులు కూడా అటే ఉంటారన్న ఆయన చేసిన ప్రకటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. జనసేన పెట్టిన కొంతకాలానికి నాగబాబు స్టాండ్ మారిపోవటం.. తమ్ముడికి మద్దతుగా నిలవటమే కాదు.. పార్టీ తరఫున నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఘోర పరాజయానికి గురయ్యారు.

ఆ తర్వాత కూడా పార్టీలో కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత క్రియాశీలకంగా ఉండటం తగ్గించారు. ఇటీవల కాలంలో పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన.. రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. పవన్ - వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూ.. మధ్యలో పోసాని ఎంట్రీ ఇచ్చి.. ఇష్యూను రచ్చ రచ్చగా మార్చిన వేళ.. ఇన్ స్టా లో అభిమానులతో లైవ్ చిట్ చాట్ చేశారు.

ఈ సందర్భంగా రాజకీయాల గురించి వచ్చినప్పుడు పెద్దగా మాట్లాడకపోవటమే కాదు.. తనకు ఆసక్తి లేదన్న మాటను చెప్పారు. తన తమ్ముడు పవన్ ను ఇష్టారాజ్యంగా తిట్టినప్పటికీ.. వ్యంగ్య వ్యాఖ్యలు చేశారే కానీ ఘాటుగా రియాక్టు కాకపోవటం గమనార్హం. సిద్ధాంతాలు.. అభిప్రాయాలు వేరైనప్పటికి తుది శ్వాస వరకు తమ సోదరుల్ని విడిచి పెట్టనని చెప్పిన వైనం చూస్తే.. పవన్ రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోకూడదన్న ఆలోచనలో నాగబాబు ఉన్నారా? అన్న సందేహం కలుగక మానదు. మొత్తంగా చూసినప్పుడు పవన్ రాజకీయ బాటలోకి మెగా బ్రదర్స్ దూరంగా ఉంటున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News