డిజిట‌ల్ మ‌నీ ఫెయిల్‌.. అక్క‌డా న‌గ‌దే!

Update: 2017-09-19 15:30 GMT
గ‌త ఏడాది న‌వంబరు 8 నుంచి దేశంలో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రూ.500 - రూ.1000 నోట్లు ర‌ద్ద‌యిపోయాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. న‌ల్ల‌ధ‌నం అరిక‌ట్ట‌డంలో భాగంగానే తాము ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు  చెప్పారు. అంతేకాదు, ఇక‌పై దేశం మొత్తం న‌గ‌దు ర‌హిత డిజిట‌ల్ మ‌నీ లావాదేవీల దిశ‌గా మారుతోంద‌ని చెప్పుకొచ్చారు. అంద‌రూ నిజ‌మే అనుకున్నారు. దేశం బాగుప‌డుతోంద‌ని భావించారు. మ‌ళ్లీ మ‌ళ్లీ మోదీనే గెలిపించాల‌ని కూడా డిసైడ్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో న‌గ‌దు ర‌హిత లావాదేవీలు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వాలు పోటీ ప‌డ్డాయి. డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు పోటీలు సైతం పెట్టాయి.

ఈ క్ర‌మ‌మంలోనే మ‌హారాష్ట లోని  థానె జిల్లా - ధసాయ్‌ గ్రామం నూటికి నూరుపాళ్లు నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. అంతేకాదు, దేశంలోనే రెండవ - మహారాష్ట్రలో తొలి స్థానం కైవ‌సం చేసుకుంది. ఈ జిల్లాలో ఏం కొనుగోలు చేసినా.. చేతిలో ఏటీఎం కార్డో లేదా - స్మార్ట్ ఫోనో ఉండాల్సిందే. వాటి నుంచి న‌గ‌దు లావాదేవీలు జ‌రిగేది! ఇలా కొని   నెల‌లు గ‌డిచాయి.  స్వైపింగ్ మిష‌న్లు రిపేర్లు వ‌చ్చాయి. అంతే! ఇంకేముంది సీన్ రివ‌ర్స్ అయింది. వ్యాపారులు వాటిని మూల‌న‌ప‌డేశారు. త‌మ పాత ప‌ద్ధ‌తుల‌కు మ‌ళ్లీ దుమ్ముదులిపారు. ప్ర‌స్తుతం ధుసాయ్‌లో కూడా సాధార‌ణ ప‌రిస్థితే క‌నిపిస్తోంది.

గ్రామంలో 20 శాతం మంది కూడా నగదురహిత లావాదేవీలు నిర్వహించడం లేదు. 80 శాతం మందికిపైగా మళ్లీ నగదు లావాదేవీలను నిర్వహిస్తున్నారు. అసలు గ్రామంలో పనిచేస్తున్న డిజిటల్‌ లావాదేవీల మిషిన్లే 25 శాతానికి మించి లేవు.  మ‌రి ఇన్ని లోపాలు ఉండ‌గా కూడా ఈ జిల్లా ఎలా న‌గ‌దు ర‌హిత జిల్లాగా ఎంపికైందో అధికారుల‌కే తెలియాలి. ప్ర‌స్తుతం ఈ గ్రామంలోని ఏ వ్యాపారిని క‌దిలించినా.. స్వైపింగ్ మిష‌న్ విష‌యం ఎత్త‌డం లేదు. అది ఉన్నా ప‌నిచేయ‌డం లేద‌ని, రిపేర్ వ‌చ్చింద‌ని, ప్ర‌జ‌లు ఎక్కువ‌గా న‌గ‌దు లావాదేవీల‌కు ఇష్ట‌ప‌డుతున్నార‌ని చెబుతున్నారు. నిజానికి ఇక్క‌డ ఒక్క‌చోటే కాదు, దేశ‌వ్యాప్తంగా కూడా ఇదే ప‌రిస్థితి ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి.. ప్ర‌ధాని మోదీ.. ప్లాన్ విఫ‌ల‌మైందా?


Tags:    

Similar News