మా తప్పులు చెప్పొద్దు.. మీవి మాత్రం దిద్దుకోండి!

Update: 2015-01-21 06:31 GMT
ఏమాటకామాట చెప్పుకోవాల్సి వస్తే... తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడున్న పరిస్థితికి కచ్చితంగా ప్రధాన పాత్ర దిగ్విజయ్‌ సింగ్‌ దే అని చెప్పేవారే ఎక్కువ! తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు, అక్కడి రాజకీయాలను అర్ధం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయిన దిగ్విజయ్‌ సింగ్‌ తనకున్న జ్ఞానంతో కాంగ్రెస్‌ పార్టీకి ఈ పరిస్థితి తీసుకువచ్చారు అనడంలో సందేహం లేదనే చెప్పాలి! తాజాగా పార్టీని ఉద్దరించడానికనో లేక పార్టీని మూసేస్తాం అని చెప్పడానికో కాని తెలంగాణకు వచ్చారు  దిగ్విజయ్‌ సింగ్‌ అలియాస్‌ డిగ్గీ రాజా! ఢిల్లీ నుండి దూత వచ్చారు కదా అని రాష్ట్రంలో పార్టీ సమస్యలను ఏకరువు పెట్టాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్‌ నాయకులను ఒక్క మాటతో నీరుగార్చేశారు ఈ సారు! పీసీసీ, సీఎల్పీ నాయకత్వాల మార్పిడి గురించి, వాటి లోపాల గురించి ఎవ్వరూ మాటలాడవద్దని, అది అధిష్టానం పరిధిలోని అంశం అని... ఈ పరిస్థితుల్లో కూడా పాడిన పాటే పాడుతున్నారు డిగ్గీ రాజా!

నేతలంతా ఐక్యంగా ఉండాలి, పార్టీకోసం అహర్నిశలు పనిచేయాలి అని చెప్పడమే తప్ప.. వారి వారి మాటలను, సమస్యలను, కనీసం పార్టీని బాగు చేయడానికి వారి అభిప్రాయాలను  పరిగణనలోకి తీసుకునే పనికి ఈ ఢిల్లీ దూత పూనుకోలేకపోయారు! మీరు ఇలాగే ఉంటే... తెలంగాణలో పార్టీని మూసేయాల్సి వస్తుందని బెదురింపు మాటలు మాట్లాడుతోన్న డిగ్విజయ్‌ సింగ్‌... అసలు విషయం మరిచిపోతోన్నారు! పార్టీని ఉద్ధరించడం అంటే.. కేవలం రాష్ట్రాల్లో నాయకుల తప్పులను ఎత్తిచూపించడం కాదు... ఢిల్లీ లెవల్లో నాయకత్వం చేస్తున్న తప్పుల గురించి కూడా తమ దృష్టికి వస్తే పరిశీలించడం అవసరం అనే అంశాన్ని ఆయన మరచిపోతున్నారు. అధిష్టానం దూతలమని చెప్పుకుంటూ దేశపర్యటన చేసే ఇటువంటి నాయకులు ఇదే రీతిగా స్థానిక నేతల వద్ద మాట్లాడితే... తెలంగాణలో ఏం కర్మ... ఏకంగా దేశం మొత్తం మీదే పార్టీని ప్రజలే మూసేస్తారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలని పలువురు సూచిస్తోన్నారు!

ఈ క్రమంలో రానున్న హైదరబాద్‌ మహా నగరపాలక సంస్థ, వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిందిగా సూచిస్తోన్న దిగ్విజయ్‌ సింగ్‌... ఆ నాయకులు చెప్పే విషయాలను మాత్రం వినడానికి సిద్దంగా లేకపోవడం కచ్చితంగా పెద్ద సమస్యే అని కాంగ్రెస్‌ నాయకులు బహిరంగంగానే చెబుతోన్నారు! 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తగిలిన దెబ్బతో అయినా ఇలా ఢిల్లీ నుండి వచ్చే నాయకుల ప్రవర్తనలోనూ, మాటతీరులోనూ మార్పు రాకపోవడం కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తును కల్లముందు చూపిస్తోంది అని పలువురు అభిప్రాయపడుతోన్నారు! ఏది ఏమైనా... మా తప్పులు మాత్రం చెప్పొద్దు.. మీవి మాత్రం దిద్దుకోండి అని ఇప్పటికీ దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడటం మాత్రం దారుణమైన విషయం అని, పార్టీ పతనానికి ఇవే పునాదులు అని విశ్లేషకుల అభిప్రాయం!
Tags:    

Similar News