జగన్ మీద డిగ్గీ కన్ను పడిందా..?

Update: 2016-11-02 06:11 GMT
ఎంత లెక్క తేడా వచ్చినా.. తల్లికి.. పిల్లకు మధ్యనున్న అనుబంధాన్ని తుంచేయలేం. కాలం పెట్టే పరీక్షల్లో..తల్లి.. పిల్ల మధ్య లెక్కలు తేడా వచ్చినా.. కాలం కలిసి వస్తే.. వారిద్దరూ ఒకటి కావటం పెద్ద కష్టమైన పని కాదు. తాజాగా ఒక ప్రముఖుడి నోటి నుంచి వచ్చిన మాట చూస్తే.. తెలుగు రాజకీయాల్లో ‘‘తల్లి.. పిల్ల’’ కలిసిపోవాలని తపించే వారి మనసుల్ని తట్టి లేపేలా.. కొత్త ఆశల్ని కల్పించేలా ఉందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ ను తల్లి కాంగ్రెస్ గా.. జగన్ పార్టీని పిల్ల కాంగ్రెస్ గా అభివర్ణించే ముచ్చట తెలిసిందే. అయితే.. ఈ రెండు పార్టీలు ఏదో రకంగా కలిసిపోతే ఎంత బాగుండన్న మాట పలువురు కాంగ్రెస్ నేతల నోట రావటం కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ సీనియర్ నేత.. సోనియమ్మ పరివారానికి అత్యంత విధేయుడైన డిగ్గీ రాజా అనబడే దిగ్విజయ్ సింగ్ నోటి నుంచి వచ్చిన ఒక కీలక వ్యాఖ్య ఏపీలోని పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. త్వరలో ఏపీ సర్కారు వైఫల్యాలపై విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టాలని భావిస్తున్న పాదయాత్రపై డిగ్గీ రాజా రియాక్ట్ అయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్ తండ్రి.. దివంగత మహానేత వైఎస్ బాటలో నడిచి.. ఆయన మాదిరే పాదయాత్రను విజయవంతంగా ముగించాలని కోరటం గమనార్హం.

విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావటమే కాదు.. ఏపీలో ఆ పార్టీ పూర్తిగా మాయమైన దుస్థితి. ఇలాంటి వేళ.. జగన్ లాంటి నాయకుడు కానీ తిరిగి కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇస్తే ఎంత బాగుండదన్న అత్యాశను పలువురు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తుంటారు. వాస్తవానికి ఇలాంటి ఊహల్లో మాత్రం కనిపిస్తుంటాయి.

అయితే.. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలీదు కాబట్టి.. దింపుడు కళ్లెం ఆశల్ని కొందరు వినిపిస్తుంటారు. ఏమైనా జగన్ పాదయాత్రపై డిగ్గీ కామెంట్.. ఆయన నజర్ జగన్ మీద ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లైందన్న భావనను కొందరు వ్యక్తం చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. జగన్ పాదయాత్ర నిర్ణయంపై డిగ్గీ రాజా పాజిటివ్ గా రియాక్ట్ కావటం.. వైఎస్ మాదిరే జగన్ సైతం పాదయాత్రలో సక్సెస్ కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటం జగన్ పరివారానికి సంతోషాన్ని కలిగిస్తుందనటంలో సందేహం లేదనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News