జనసేనాని పై అభిమానం కారు దిగనివ్వలేదు.. రైతుల్లో నిరాశ

Update: 2023-05-11 14:49 GMT
అకాల వర్షాలతో ఆగమాగం అయిన రైతుల ను ఆదుకోవాలని కోరుతూ విపక్షాలు ఏపీ ప్రభుత్వంపై డిమాండ్లు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా గోదావరి జిల్లాల పర్యటన చేపట్టటం తెలిసిందే. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో చేపట్టిన పవన్ పర్యటనకు తరలి వచ్చిన వైనం చూస్తే.. జనసంద్రాన్ని తలపించేలా ఉందని చెప్పాలి.

పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతుల్ని పరామర్శించేందుకు వచ్చిన పవన్ కల్యాణ్.. కనీసం కారు కూడా దిగలేని పిరస్థితి నెలకొంది. అంతలా తరలివచ్చిన జనంతో అక్కడి వాతావరణం మొత్తం హడావుడిగా మారింది. దారి పొడువునా పవన్ కు నీరాజనాలు పలికారు. అవిడి రాజుపాలెం రైతులు తమ ధాన్యం రాశులతో పవన్ కోసం వెయిట్ చేశారు. ఇలాంటి వేళ అక్కడ కు వచ్చిన పవన్..ముందు మీడియాతో కాసేపు మాట్లాడారు.

రైతులతో ముఖాముఖి మాట్లాడే సమయానికి తీవ్రమైన తొక్కిసలాట.. గందరగోళం చోటు చేసుకుంది. దీనికి తోడు చుట్టు ఉన్న జనసందోహం ఆయన్ను చుట్టుముట్టటంతో వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయన్ను కారులో ఎక్కించేశారు. అక్కడి నుంచి రాజుపాలెం కు వెళ్లిన పవన్ కు.. అక్కడా అలాంటి పరిస్థితే నెలకొంది. రైతులతో ముఖాముఖి కోసం ఏర్పాటు చేసినప్పటికీ.. కారు కిందకు కూడా దిగలేని పరిస్థితి. అంతలా జనం వచ్చేశారు. దీంతో కారు నుంచి బయట కు రాలేని పవన్ కల్యాణ్ కారు పైకి ఎక్కి రైతుల కు అభివాదం చేసి వెళ్లిపోయారు.

రావులపాలెం పి.గన్నవరం మండలం రాజుపాలెం వరకు పవన్ పర్యటించగా.. మార్గమధ్యలో రోడ్ల కు ఇరువైపులా భారీ జనం మొహరించారు. మందపల్లి..కొత్తపేట పురవీధులు మొత్తం జనంతో కిక్కిరిసిపోయాయి. పవన్ ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. పోలీసులు.. వ్యక్తిగత సిబ్బంది.. రోప్ పార్టీలతో పాటు బౌన్సర్లు సైతం జనాల్ని అదుపు చేయలేకపోయారు.

దీంతో.. రైతుల్నిపరామర్శించేందుకు కారు కూడా దిగలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన రైతుల వద్దకు వెళ్లలేకపోయారు. అభిమానం పవన్ ను కారులో నుంచి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితిని తీసుకురావటమే కాదు. పరామర్శకు అవకాశం ఇవ్వలేదు. ఈ ఉదంతం పవన్ కు కొత్త అనుభవాన్ని ఇచ్చిందని చెప్పాలి.

Similar News