మ‌న 'మ‌న్నెం' మాణిక్యం కాదట‌!

Update: 2018-10-25 05:11 GMT
అవును.. మ‌నోడే. అయితే మాత్రం.. త‌ప్పు చేస్తే నెత్తికి ఎత్తుకోవాలా? మ‌ర‌క‌ల్ని తుడిచేసి.. సుద్ధ‌పూస అంటూ డ‌బ్బా కొట్టుకోవాలా?..అరే.. అవ్వ‌క‌.. అవ్వ‌క‌.. ఇన్నాళ్ల‌కు ఒక తెలుగోడు మ‌ళ్లీ సీబీఐ బాస్ అయితే.. ఎద‌వ మాట‌లు చెప్పి.. చెత్త ఆరోప‌ణ‌ల‌తో చిన్న‌బుచ్చ‌టం అవ‌స‌ర‌మా? అనుకోవ‌చ్చు.

అదే స‌మ‌యంలో ఎంత మ‌నోడైతే మాత్రం త‌ప్పులు చేసి ఉంటే.. ఆ విష‌యాన్ని చెప్పాలే కానీ.. కీల‌క‌ స్థానానికి చేరుకున్నాడ‌ని మురిసిపోవాలా? అన్న‌ది క్వ‌శ్చ‌న్‌. మ‌నోడా.. ప‌రాయి వ్య‌క్తా? అన్న‌ది ప‌క్క‌న పెడితే త‌ప్పును త‌ప్పుగా.. ఒప్పును ఒప్పుగా ఎత్తి చూప‌టం ధ‌ర్మం. తాజాగా తెలుగోడు మున్నెం నాగేశ్వ‌ర‌రావు సీబీఐ డైరెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వేళ‌.. ఆయ‌న ఎంపిక‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఆయ‌న ఎంపిక‌ను త‌ప్పు ప‌డుతూ జాతీయ స్థాయిలో ప‌లువురు ప్ర‌ముఖులు ఇప్పుడు గ‌ళం విప్పుతున్నారు. మ‌న్నెం ఎంపిక‌ను త‌ప్పు ప‌డుతున్న వారు ఎవ‌రు?  వారేం మాట్లాడారు? అన్న‌ది చూస్తే..  డీఎంకే చీప్ స్టాలిన్ మాట‌ల్లోనే చూస్తే.. మ‌న్నెం నియ‌మ‌కాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. అంతేనా.. కేంద్ర ప్రభుత్వ నిర్ణ‌యం దేశంలో విధించిన అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

నాగేశ్వ‌ర‌రావు లాంటి వివాదాస్ప‌ద అధికారిని సీబీఐ డైరెక్ట‌ర్ గా నియ‌మించ‌టం అంటే.. రాఫెల్ కుంభ‌కోణాన్ని క‌ప్పి పుచ్చ‌టానికేనా? అన్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. నాగేశ్వ‌ర‌రావుపై సీబీఐకు ప‌లు ఫిర్యాదులు వెళ్లాయ‌ని.. వాటిపై ద‌ర్యాప్తు నిర్వ‌హించాల‌ని ఆలోక్ వ‌ర్మ భావించిన‌ట్లు చెప్పారు. ఇప్పుడు అదే అలోక్ వ‌ర్మ సెల‌వుపై వెళితే.. ఆయ‌న సీట్లో మ‌న్నెం కూర్చున్నారు.

ఇక‌.. బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. మేధావిగా చెప్పే సుబ్ర‌మ‌ణ్య స్వామి అయితే సీబీఐలో చోటు చేసుకున్న ప‌రిణామాలపై వ్యంగ్య వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. సీబీఐ ప‌రిణామాల్ని ఆయ‌న ఊచ‌కోత‌గా అభివ‌ర్ణించ‌టం గ‌మ‌నార్హం. అవినీతిప‌రుల్ని వెన‌కేసుకొస్తున్నార‌ని.. త‌దుప‌రి ల‌క్ష్యం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ రాజేశ్వ‌ర్ సింగ్ కావొచ్చ‌న్నారు. సీబీఐ ఊచ‌కోత‌కు పాల్ప‌డిన‌వారు ఇక ఆయ‌న్ను స‌స్పెండ్ చేసే అవ‌కాశం ఉంద‌ని మండిప‌డ్డారు. సొంత  ప్ర‌భుత్వంపై ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు చూస్తే.. ప‌రిస్థితి తీవ్ర‌త‌ను ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక‌.. సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి ఈ ఇష్యూపై స్పందిస్తూ.. త‌న సొంత మ‌నిషి అస్థానాను కాపాడేందుకే మోడీ స‌ర్కారు సీబీఐ డైరెక్ట‌ర్ పై వేటు వేసింద‌ని.. బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో ఆయ‌న‌కున్న సంబంధాల్ని క‌ప్పిపుచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని మండిప‌డ్డారు.

రాజ‌కీయ నేత‌ల తీరు ఇలా ఉంటే.. సీబీఐ మాజీ ఉన్న‌తాధికారులైతే జ‌రిగిన ప‌రిణామాల‌పై షాక్ కు గురి అవుతున్నారు. సీబీఐ చ‌రిత్ర‌లోనే ఇలా జ‌ర‌గ‌లేదంటున్నారు. సీబీఐ నేరుగా ప్ర‌ధాని ప‌రిధిలో ఉంద‌ని.. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు సీబీఐ చ‌రిత్ర‌లోనే చోటు చేసుకోలేద‌న్న ఒక మాజీ ప్ర‌ముఖుడు సీబీఐ గౌర‌వాన్ని.. మ‌ర్యాద‌ను కాపాడాల్సిన బాధ్య‌త ఉంద‌న్నారు. ప్ర‌భుత్వం ఇంకా క‌ళ్లు తెర‌వ‌క‌పోవ‌టం త‌న‌ను షాక్ కు గురి చేస్తుంద‌ని స‌ద‌రు మాజీ సీనియ‌ర్ వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News