వైసీపీలో అసంతృప్తి : ల్యాండ్ అయ్యేది అక్కడేనట...?

Update: 2022-05-30 03:30 GMT
అసంతృప్తి ఒక దావానలం లాంటిది. అది ఉన్న చోట కారుచిచ్చు రాజేస్తుంది. మొత్తానికి మొత్తం దహిస్తుంది. ఆదిలోనే దాన్ని కనిపెట్టి పనిపట్టాలి. కానీ అది ఎపుడూ జరగదు, అది బయటకు వచ్చేటప్పటికే జ్వాల అలా ఎగిసిపడుతూంటుంది. సహజంగా అధికార పార్టీలోనే అసంతృప్తి ఉంటుంది. అధికార పార్టీతో జత కట్టి అది సావాసం చేస్తూంటుంది.

అందుకే ఎక్కడ పవర్ ఉన్న ఆ వెలుగులో మరింతగా జ్వలిస్తూ ఉంటుంది. ఇపుడు ఏపీలో అధికార పార్టీ వైసీపీలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. మూడేళ్ళ పాలన ముగిసింది. మరో రెండేళ్ళ పాలన ఉంది. అయితే ఇపుడు నేతలకు ఒక విషయం అర్ధం అయింది. తాము ఉన్న సమయం కంటే ఉండబోయే సమయం తక్కువ అని. అంతే కాదు, తాము ఎన్నాళ్ళు ఉన్నా ఇక ఒరిగేది తమకు మిగిలేది ఏదీ లేదని, దాంతో ముందు చూపున్న వారు, తమకు అవకాశాలు వెతుక్కోగలవారు జాగ్రత్తగా సర్దుకుంటున్నారు.

అసంతృప్త నేతలు ప్రతీ జిల్లాలోనూ ఉన్నారు. ముందుగా నెల్లూరు గురించి చెప్పుకుంటే మాజీ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి గురించే చెప్పాలి. ఆయన పార్టీలో చేరి ఎమ్మెల్యే అవగలిగారు కానీ మంత్రి మాత్రం కాలేకపోయారు. ఆయన సుదీర్ఘ అనుభవం వైసీపీలో ఏ మాత్రం లెక్కకు రాలేదు. ఆయన అక్కడ కొత్త పూజారి అయ్యారు. ఆయన్ని జూనియర్ నేతగానే జమ కడుతున్నారు. దాంతో ఆనం తన రూట్ ఏంటో చెప్పేశారు.

ముందుగా కుమార్తె కైవల్యారెడ్డిని టీడీపీలోకి పంపిస్తున్నారు. సమయం సందర్భం చూసుకుని తాను కూడా సైకిలెక్కబోతున్నారు. ఇది కన్ ఫర్మ్. ఈ విషయంలో ఎలాంటి డౌటూ లేదని నెల్లూరు రాజకీయ వర్గాలు అంటున్నారు. ఆనం అయితే నా కూతురు ఏ పార్టీలో చేరితే నాకేంటి సంబంధం అని అంటున్నారు. ఇలా పైకి ఆయన అంటున్నా మనసులో ఆయన మద్దతు పూర్తిగా ఇచ్చి ఉంటారని అంతా అనుకుంటున్నారు.

ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారు. వారిలో కొందరు టీడీపీలో ఉన్నపుడు జిల్లా అధ్యక్ష బాధ్యతలను కూడా నిర్వహించి గౌరవాన్ని అందుకున్నారు. వారు వైసీపీలో వైభోగం ఉంటుందని భావించి వచ్చారు. కానీ ఇపుడు సీన్ మారింది అని వాపోతున్నారు. ఇక విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే తిరిగి పసుపు గూటికి వెళ్ళేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన వైసీపీకి మద్దతు ఇచ్చి కొన్నాళ్ళు నడచినా ఇపుడు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు.

ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ కూడా వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది తెలుగుదేశం బెటర్ అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారిలో టికెట్లు ఈసారి దక్కవని భావిస్తున్న వారు, బడా నేతలు ఉన్నారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక వైసీపీ ఎమ్మెల్యే మీద పార్టీలోనే అసంతృప్తి ఉంది. ఆయనకు టికెట్ దక్కదు అంటున్నారు. మరి ఆయన చూపు కూడా సైకిల్ మీదనే ఉందని అంటున్నారు.

అలాగే గోదావరి జిల్లాలలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. వారు గతంలో ఏకంగా చంద్రబాబునే సవాల్ చేసేవారు కానీ ఇపుడు మాత్రం గమ్మున ఉంటున్నారు. దానికి జిల్లాలో మారిన రాజకీయ సామాజిక పరిస్థితులే అంటున్నారు దాంతో వారు కూడా తమకు రాజకీయ జన్మ ఇచ్చిన పార్టీలలోకి వెళ్ళాలని చూస్తున్నారు అని తెలుస్తోంది.

ఇక కోస్తా జిల్లాలలో చూసుకుంటే కూడా ఇదే సీన్ ఉంది. పార్టీ అధికారంలో ఉన్నపుడు చేరిన వారు ఇపుడు వెనక్కి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కావాల్సింది కూడా అధికారం అని తేలిపోయిన వేళ కండువా మార్చేస్తే పోలా అని ఆలోచిస్తున్నారుట. ఇక గుంటూరు జిల్లాకు చెందిన ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన నాయకుడిని ఆయన అనుచరులు టీడీపీలో చేరమని వత్తిడి తెస్తున్నారు అని తెలుస్తోంది. ఆ నాయకుడికి  వైసీపీ పెద్దలు అన్ని రకాలుగా ఆశపెట్టి ఏ పదవీ ఇవ్వకపోవడంతో రగిలిపోతున్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం ఆయన కుమారుడు కూడా వైసీపీలో ఇపుడు ఉన్నా కూడా ఎన్నికల వేళకు ఎలా ఉంటారో తెలియదు అని అంటున్నారు. అలాగే మాజీ మంత్రి, టీడీపీ ద్వారా అధికార వైభోగం చూసిన శిద్ధా రాఘవరావు కూడా సైకిలెక్కాలని ఉబలాటపడుతున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా రాయలసీమలో చూసుకుంటే మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వంటి వారు టీడీపీయే శరణ్యం అని అంటున్నట్లుగా భోగట్టా.

ఈ జాబితాతో పాటుగా ఇంకా అధికార పార్టీలో టికెట్లు కనుక దక్కక‌పోతే వారు సైతం జంపింగ్ బాట పడతారు అని అంటున్నారు. అయితే ఇంకా రెండేళ్ళ పాటు అధికారం చేతిలో ఉండడంతో చాలా మంది ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా ఆనం మాస్టారు ముందుగా పావులు కదిపారు. రానున్న రోజులలో మాత్రం చాలా మంది అటు నుంచి ఇటు జంప్ చేయడం ఖాయమనే అంటున్నారు. టీడీపీ కూడా ఒక వ్యూహం ప్రకారం అధికార పార్టీ నేతలను చేర్చుకుని ఆయా జిల్లాలలో హుషార్ తేవాలని చూస్తోందిట.
Tags:    

Similar News