లేడీ ఫైర్‌ బ్రాండ్ పాద‌యాత్రకు రెడీ...!

Update: 2018-02-28 05:27 GMT
తెలంగాణ‌లో రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాన‌ప్ప‌టికీ...అదే స్థాయిలో అధికార ప్ర‌తిప‌క్షాలు త‌మ వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ స‌మ‌రోత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే పీసీసీ ముఖ్య‌నేత‌లంతా క‌లిసి బ‌స్సుయాత్ర పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌గా తాజాగా మ‌రో సీనియ‌ర్ ఇలాంటి యాత్ర‌కే సిద్ధ‌మ‌య్యారు. అయితే అది బ‌స్సుయాత్ర కాకుండా పాద‌యాత్ర అవ‌డం విశేషం. ఇంత‌కీ ఆ లీడ‌ర్ ఎవ‌రంటే...కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు డీకే అరుణ‌.

తాజాగా విలేక‌రుల స‌మావేశంలో అనంతరం ఇష్టాగోష్టిగా మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు రైతులను ఆదుకోవాలనే సోయి నాలుగేళ్లకు వచ్చిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌ నాలుగేళ్లకు రుణమాఫీ చేస్తే అది రుణ వడ్డీ చెల్లింపుల మాఫికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రౌడీ సమన్వయ సమితిలను ఏర్పాటు చేశారని వాటినే రైతు సమన్వయ సమితి అంటున్నార‌ని వ్యాఖ్యానించారు. ఒక్క ఎకరా కూడా సర్వే చేయలేదని, పైగా మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని సర్వేలకే వాడుతున్నారని ఆరోపించారు. ఎకరాకు నాలుగువేలు స్కీమ్ వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం తీసుకొచ్చారని అరుణ ఆరోపించారు. నాలుగు వేలు ఇచ్చినంత మాత్రాన రైతులు కేసీఆర్‌ పక్షాన ఉంటారనుకుంటే పొరపాటేన‌ని ఆమె వ్యాఖ్యానించారు. ``నాలుగేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చారా?ఒక్క ఎకరాకు నీళ్ళు అందించారా...?కేవలం ఉన్నవాటి పేర్లు మార్చారు...ప్రాజెక్టుల ఖర్చు పెంచారు. నాలుగేళ్లలో ఏ ఒక్క విద్యుత్ ప్రాజెక్టు నిర్మించారా?ఒక్క యూనిట్  విద్యుత్ ఉత్పత్తి చేశారా? ఇచ్చిన హామీ నెరవేర్చకుండా...కొత్త హామీలిస్తున్నారు. సామాన్య ప్రజలను, రైతులను కలవని సీఎం కేసీఆర్ ఒక్క‌రే. సీఎం మాత్రం ప్రశ్నించొచ్చు...ఆయనను మాత్రం ప్రశ్నించొద్దు అన‌డం ఏం ప‌ద్ద‌తి?` అంటూ అరుణ విరుచుకుప‌డ్డారు.

ఏప్రిల్ చివరివారంలో పాదయాత్ర చేసేలా ప్లాన్ చేస్తున్నాన‌ని డీకే అరుణ మీడియాకు తెలిపారు. ఆలంపూర్ టూ ఆదిలాబాద్ వరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. 119 నియోజకవర్గాల్లో ప్రతి జిల్లాలోని ముఖ్య ప్రాంతాలన్నీ కలిసేలా పాదయాత్ర ప్లాన్ చేస్తున్నాన‌ని ఆమె వివ‌రించారు. ఏ జిల్లా నేతలు ఆ జిల్లా పాదయాత్రలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాన‌ని ఆమె వెల్ల‌డించారు. రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నానని...ఉమ్మడి అన్ని జిల్లా నేతలతో మాట్లాడుతున్నానని అరుణ వివ‌రించారు. టీఆర్ ఎస్ హామీలు...వాటి అమలు...ప్రజా సమస్యలు...సర్కార్ సంక్షేమ పథకాల వైపల్యాల పై పాదయాత్రలో ప్రజలతో మాట్లాడుతాన‌ని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ అనే విషయాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాన‌ని ఆమె వివ‌రించారు. కాంగ్రెస్ కు ఓటేసి సోనియా రుణం తీర్చికొండని చెబుతాన‌ని త‌న ఆలోచ‌న‌ను పంచుకున్నారు.
Tags:    

Similar News