టీ అసెంబ్లీలోకోట్లాడుకున్న మహిళా నేతలు

Update: 2015-03-18 10:21 GMT
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌ గానే సాగుతున్నాయి. ఈ మధ్యన మంత్రి పద్మారావు ఛాంబర్‌ వద్దకు అధికారపక్షానికి చెందిన మహిళా నేత.. ప్రభుత్వ విప్‌  గొంగిడి సునీత తీసుకుకురావటం.. ఇలాంటి సిఫార్సులు తన వద్దకు తీసుకొస్తే బాగోదని ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. ఈ సందర్భంగా సదరు అక్రమ లిక్కర్‌ వ్యాపారిని సైతం హెచ్చరిస్తూ.. మరోసారి ఇలాంటి పని చేస్తే పీడీయాక్ట్‌ మీద కేసు పెట్టిస్తానని హెచ్చరించటం తెలిసిందే.

ఈ వ్యవహారం బయటకు రావటం.. మీడియాలో ప్రచురితం కావటమే కాదు.. పద్మారావు తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. దీంతో.. సర్కారు ఇమేజ్‌ పెరిగిందని సంబరపడిన అధికారపక్ష నేతలకు.. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి డీకే అరుణ తెలంగాణ అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తారు. పత్రికల్లో వచ్చిన వార్త నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అధికారపక్షానికి చెందిన సునీతకు.. డీకే అరుణకు మధ్య వాదోపవాదాలు జరిగాయి.

అక్రమ మద్యం వ్యాపారి అసెంబ్లీ లాబీల్లోకి వచ్చారా? అలా ఎలా తీసుకొస్తారంటూ డీకే అరుణ ప్రశ్నించగా.. దీనికి సమాధానం ఇస్తూ గొంగడి సునీత.. డీకే అరుణపై కోర్టులో అక్రమ ఇసుక కేసు నడుస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది.

కొసమెరుపేమంటే.. ఈ వ్యవహారంలో కీలకమైన మంత్రి పద్మారావు కల్పించుకుంటూ.. అక్రమ మద్యం వ్యాపారి ఎవరూ అసెంబ్లీ లాబీల్లోకి రాలేదని.. అనవసరమైన ఆరోపణలు సరికాదని వ్యాఖ్యానించారు. మరి.. ఇదే నిజమైతే.. లిక్కర్‌ వ్యాపారిపై తీవ్రంగా చెలరేగిన పద్మారావుపై  మీడియా ప్రశంసలు కురిపించినప్పుడు అది తప్పుడు వార్త అని ఎందుకు ఖండించలేదో..? మరోవైపు ఇదే విషయంపై డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. సభలో తనపై ఉన్న కేసును ప్రస్తావించటం ద్వారా.. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు. తనకు మైకు ఇవ్వకుండా కట్‌ చేస్తున్నారంటూ వాపోయారు.
Tags:    

Similar News