బాబుతో పాటు మరే తెలుగు తమ్ముడు ఇవ్వని సర్టిఫికేట్ పవన్ కు ఇచ్చిన వైసీపీ నేత

Update: 2022-12-22 04:03 GMT
ఒకప్పటి మిత్రుడు.. రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మరింత దగ్గర కానున్న సీనియర్ నేత ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ అధినేత చంద్రబాబే. గతంలో తాను అన్న మాటకు తగ్గట్లే.. జగన్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వనన్న  పవన్.. అదే మాట మీద తాను స్టాండ్ అయి ఉన్నానన్న విషయాన్ని అదే పనిగా స్పష్టం చేయటం తెలిసిందే. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో ఆయన ఈ విషయం మీద మరింత స్పష్టతతో ఉన్న విషయం గత వారం సత్తెనపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాటల్ని విన్నప్పుడు అర్థమవుతుంది.

పవన్ కల్యాణ్ బయటకు రాబోతున్నారన్నంతనే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యంగా వైసీపీ నేతలు పలువురు.. ఆయన్ను ప్యాకేజీ స్టార్ గా అభివర్ణించటం.. అవాకులు చవాకులు పేలటం చూస్తునే ఉంటాం. టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద నుంచి భారీగా ప్యాకేజీ తీసుకొనట్లుగా అర్థం లేని ఆరోపణలు చేస్తుంటారు. నిజంగానే చంద్రబాబు దగ్గర అంత భారీగా ప్యాకేజీ తీసుకొని ఉంటే.. ఆ డబ్బుల్ని ఆస్తుల రూపంలోనో.. వ్యాపార రూపంలో ఎక్కడో ఒక చోట పెట్టుబడి పెడతారు కదా? ఒకవేళ అలాంటిదే జరిగి ఉంటే.. ఈ పాటికి బయటకు రాకుండా ఉండేదా?

తమను అదే పనిగా ఇబ్బంది పెట్టే పవన్ సంగతి చూసేందుకు వైసీపీ సర్కారు ఎంత ఉత్సాహంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కోణంలో చూసినప్పుడు గడిచిన మూడున్నరేళ్ల కాలంలో పవన్ నిజంగానే ప్యాకేజీ స్టార్ అయితే.. దానికి సంబంధించిన వార్తలు బ్యానర్లుగా ప్రచురితమయ్యేవి కూడా. నిజానికి గత ఎన్నికల సమయంలో జగన్ కు వేర్వేరు మార్గాల్లో అందిన సాయంతో పోల్చినప్పుడు.. అందులో ఒకటో వంతు సాయం పవన్ కు చంద్రబాబు నుంచి అందలేదన్న మాట ఈ ఇరు వర్గాలకు సన్నిహితంగా ఉన్న వారుచెబుతుంటారు.

అలాంటిది నిత్యం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి.. ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా తరచూ ఏవో ఒక వ్యాఖ్యల్ని చేస్తుంటారు వైసీపీ నేతలు. ఇలాంటి వేళలో.. పవన్ నిజాయితీ గురించి ఏ సందర్భంలోనూ చంద్రబాబు కానీ.. మరే తెలుగుదేశం పార్టీ నేత కానీ చెప్పినట్లు కనిపించదు. తాజాగా ఆ కొరత తీరుస్తూ వైసీపీకి చెందిన డీఎల్ రవీంద్రా రెడ్డి పవన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన మిత్రుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు సీఎం అయినందుకు చాలా సంతోషించానని.. అయితే ఆయన ప్రభుత్వంలో జరిగిన భారీ అవినీతికి సిగ్గుపడుతున్నట్లుగా చెప్పటం తెలిసిందే.

అంతలా ముక్కుసూటిగా మాట్లాడే వైసీపీ నేత డీఎల్.. జనసేన పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిజాయితీపరుడని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ నిజాయితీ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు మరే తెలుగు తమ్ముడు ప్రస్తావించని వేళ.. అందుకు భిన్నంగా వైసీపీకి చెందిన డీఎల్ నోటి నుంచి ఆయన క్యారెక్టర్ కు ఒకసర్టిఫికేట్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి ఏ పార్టీ నేత నుంచి ఇలాంటి సర్టిఫికేట్ ఊహించమో.. అలాంటి పార్టీ నేత నుంచి.. అందునా వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన నాయకుడి నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News