డాక్టర్లతో గొడవ పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే

Update: 2017-07-13 12:05 GMT
అనంతపురం టీడీపీలో నేతలు కొట్లాడుకోవడం కామనే.. కానీ, ఈసారి అనంతపురం టీడీపీ నేత - అక్కడి ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి వైద్యులతో పెట్టుకున్నారు. దీంతో వారంతా ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. మూడేళ్లలో ఆయన చేసిందేమీ లేదని.. స్థానిక ఆసుపత్రిలో ఒక వాటర్ ఫిల్టర్ పెట్టించడం మినహా ఆయన సాధించింది శూన్యమంటూ ఏకిపడేస్తున్నారు.
    
అనంతపురం పెద్దాసుపత్రిలో ఎమ్మెల్యే నిన్న అందరు హెచ్‌ఓడీలతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన.. ఆస్పత్రిలో బెడ్లు లేక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని, కొత్తగా నిర్మించిన భవనంలో వారికి ఏర్పాట్లు చేయాలని సూపరింటిండెంట్ కు సూచించారు. కానీ... గర్భిణిలు పై అంతస్తుకు ఎక్కలేరని ఆయన చెప్పారు... అయితే, పిల్లల వార్డును అక్కడికి మార్చాలని ఆయన సూచించారు.. అందుకు సిబ్బంది కొరత ఉందని సూపరింటిండెంట్ చెప్పారు. అంతేకాదు... భద్రత - పారిశుద్ధ్య సమస్యలూ ఉన్నాయన్నారు.
    
ఆ వెంటనే ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. అనంతరం అక్కడి వైద్యులు కూడా కొత్త భవనంలో మూడు షిఫ్టులకు 40 మంది అవసరమవుతారని, వీరి జీతాలకు నెలకు రూ.2.08 లక్షలు అవసరమని చెప్పారు. అంతలోనే... ఎమ్మెల్యే అక్కడున్న మానసిక వైద్యుడు యెండ్లూరి ప్రభాకర్‌ ను పిలిచి... ‘ప్రభాకర్‌..  మీ అసోసియేషన్‌ నుంచి మూడు నెలల జీతాలివ్వండి.. మొన్న కాన్ఫరెన్స్‌ కు రూ.50 లక్షలు ఖర్చు పెట్టారు. 400 పట్టుచీరలు పంచారు.. బ్రహ్మాండంగా ఖర్చు పెట్టారట. ఇదీ ఓ సమస్యనా’ అని అన్నారు. దీంతో వివాదం మొదలైంది. దానికి ఆయన స్పందిస్తూ... మీరు అలా అనడం కరెక్టు కాదు, రాష్ర్టస్థాయి సదస్సును అనంతపురంలో నిర్వహిస్తుంటే ఇలాంటి నిందలేస్తారా అని అడిగారు. ప్రభుత్వం నుంచి నిధులేమీ రాకపోయినా కూడా జాతీయ స్థాయిలో పేరున్న డాక్టర్లను పిలిపించి మానసిక వైద్యంపై చర్చించామని... దీనికి రూ.50 లక్షలు ఎందుకవుతుందని ప్రశ్నించారు.  దీంతో ఎమ్మెల్యే ఓ వ్యక్తికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు... సదస్సుకు ఎంత ఖర్చయిందో ఆయన్న అడగ్గా 30 లక్షలని చెప్పారు. దీంతో ఆ డాక్టర్ మరింత సీరియస్ అయ్యి  ఎవరో చెబితే నమ్మి ఇలా మాట్లాడుతారా.. ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తే ఇదా మీ తీరు అంటూ ఏకిపారేశారు.
    
ఎమ్మెల్యే వ్యవహారంపై అనంత వైద్యులు మండిపడుతున్నారు. వంద బెడ్లతో వార్డును ప్రారంభించాలంటే వైద్యులు - పారామెడికల్‌ సిబ్బంది అంతా ఉండాలని... అవన్నీ పట్టించుకోకుండా  హడావుడి చేస్తే కాదని... ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటి నుంచి ఆస్పత్రికి ఆయన ఏమీ చేయలేదని ఆరోపిస్తున్నారు. అంతేకాదు... నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 510 పోస్టులు భర్తీ చేసేందుకు విడుదల చేసిన జీఓ 124ను అమలు చేయించి సిబ్బంది కొరత తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News