వైద్యుడా వందనం .. వైరల్ అవుతోన్న డాక్టర్ హ్యాండ్ ఫోటో !

Update: 2020-08-30 03:30 GMT
కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం మొత్తం వణికిపోతోంది . ఈ కరోనా ప్రాణాంతకమైన వైరస్ అని తెలిసినప్పటికీ కూడా వైద్యులు తమ విధి నిర్వహణ చేశారు. అలాగే ఎంతోమంది కరోనా కి చికిత్స అందిస్తూ  కన్నుమూశారు. ఈ కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వైద్యుల కొరత ఎలా ఉంది. ముఖ్యంగా మనదేశంలో వైద్యుల కొరత ఏ స్థాయిలో ఉందొ అర్థమైంది. ప్రతి  1000 మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంటే .. మన దేశంలో  10,189 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. అంటే 6 లక్షల మంది వైద్యుల కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విరుచుకుపడటంతో అరకొరగా ఉన్న వైద్య సిబ్బందిపై అదనపు భారం పడింది.

అయినా , మన వైద్యులు వెనకడగు వేయలేదు. మహమ్మారిపై పోరాటంలో వారే ‘ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌’ గా నిలిచారు. రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ, డ్యూటీ టైం కంటే ఎక్కువ పనిచేస్తూ నిజమైన యోధులుగా నిలుస్తున్నారు. వైద్యం చేయడం ఒక ఎత్తయితే, మహమ్మారి నుంచి రక్షణ కోసం పీపీఈ కిట్లు, గ్లౌజులు ధరించి గంటలపాటు విధులు నిర్వహించడం వారికి మరో సవాల్ గా నిలిచింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వైద్యుడు షేర్‌ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం తెగ వైరలవ్వడమే కాక ప్రశంసలు పొందుతుంది. సయ్యద్‌ ఫైజాన్‌ అహ్మద్‌ అనే యువ వైద్యుడు ముడతలు పడిన తన చేతి ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘కోవిడ్‌-19 వార్డులో దాదాపు 10 గంటలపాటు గ్లౌజులు ధరించడంతో నా చేతులు ఇలా అయ్యాయి’ అంటూ షేర్‌ చేసిన ఈ ఫోటో నెటిజనులను ఆకట్టుకుంటుంది. వెలకట్టలేని సేవ చేస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా ఫైజాన్‌ మాట్లాడుతూ.. ‘ప్రతి ఐదుగంటలకు ఒకసారి గ్లౌజులు మార్చాలి. ఇందుకు 5-7 నిమిషాల సమయం పడుతుది. కానీ చాలా సార్లు అది వీలుకాదు.. సమయం కూడా దొరకదు. ఎందుకంటే విధుల్లో మీరు ఒక్కరే ఉంటారు. పేషెంట్‌ దగ్గర ఇతర సిబ్బంది అందుబాటులో ఉండరు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మీరు వైద్యుడు, వార్డ్‌ బాయ్‌, నర్స్‌ పాత్రలు కూడా పోషించాల్సి ఉంటుంది. నా షిఫ్ట్‌ అయిపోయింది.. ఇక నేను వెళ్తాను అనే పరిస్థితి కూడా ఉండదు’ అన్నారు సయ్యద్. అంతేకాక ‘ఇదంతా ఒక ఎత్తైతే ఇక పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహించడం సవాలు వంటిది. చెమట పట్టి ముఖం మీదకు కారుతుంది. తుడుచుకోలేని పరిస్థితి. మాస్క్‌ ను కూడా సరి చేసుకోలేం. ఇక తల మీద క్యాప్‌తో మరింత ఇబ్బంది. మొదట్లో పీపీఈ కిట్లు ధరించి పని చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం అలవాటయ్యింది. నేను సర్జన్‌ ని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కరోనా ‌ డాక్టర్‌ గా విధులు నిర్వహించాల్సిందే అని  అన్నారు.
Tags:    

Similar News