ఢిల్లీని ఇక ఖాళీ చేయాల్సిందేనా? ఘోస్ట్ సిటీగా అవుతుందా ?

Update: 2019-11-02 10:48 GMT
ఏదైనా ఒక పరిమితం వరకే .. ఒకసారి పరిమితి దాటితే ఎలా ఉంటుందో ఢిల్లీ ని చూస్తే అర్థమౌతుంది. గత కొన్నేళ్లుగా యథేచ్ఛగా పర్యావరణాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు కాలుష్యాన్ని పెంచి పోషించారు. దీనితో గత కొన్ని రోజులుగా కాలుష్యాన్ని ఎంత తగ్గించాలని చూస్తున్నా కూడా కుదరడం లేదు. తాజాగా  వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకర స్థితికి దిగజారగా.. శుక్రవారం ఏక్యూఐ  రికార్డు స్థాయిలో 599కు చేరుకోవడంతో హెల్త్ ఎమర్జెన్సీని విధించారు.

సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ, పర్యావరణ కాలుష్య నియంత్రణ సంస్థ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ నెల ఐదో తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అలాగే కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆయన లేఖలు రాశారు. కాగా గతేడాది జనవరి తర్వాత గాలిలో నాణ్యతా ప్రమాణాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.

ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను కాల్చడం, దీపావళి సమయంలో బాణసంచా పేలుళ్లు, పరిశ్రమలు, వాహన కాలుష్యాలతో రాజధాని ఓ గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది. ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం మొత్తంగా 50లక్షల మాస్క్‌లను పంపిణీ చేస్తోంది. మాస్క్ లేకుండా బయటకు రావొద్దని ఢిల్లీ వాసులను కేజ్రీవాల్ కోరారు. మరోవైపు ఢిల్లీలో కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు కేజ్రీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే 48 గంటల్లో ఏక్యూఐ మరింత ప్రమాదకర స్థాయికి పడిపోతే.. కార్ల ప్రయాణికులకు ‘సరి-బేసి’  విధానాన్ని అమలు చేయబోతుంది. సరి- బేసి రేషనింగ్‌తో వాయు కాలుష్యం తగ్గుతుందని, ఈ నెల 15 వరకు ఈ విధానం కొనసాగిస్తామని ప్రభుత్వం తెలిపింది. కాగా రోజురోజుకు పెరుగుతోన్న కాలుష్యంతో రాజధాని వాసుల్లోనూ టెన్షన్ నెలకొంది. మరికొంతమంది ఢిల్లీ నుండి దుకాణం సర్దేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజులు కొనసాగితే .... ఢిల్లీ సిటీ కాస్త దెయ్యాల సిటీగా మారిన  పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.
Tags:    

Similar News