దేశ ప్ర‌ధాని పీఠం పై కేసీఆర్‌.. ఛాన్స్ ఉందా?

Update: 2022-02-16 10:31 GMT
జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పేందుకురెడీ అయిన తెలంగాణ ముద్దుబిడ్డ‌.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అత్యం త వేగంగా, స‌మ‌ర్ధ‌వంతంగా పావులు క‌దుపుతున్నారు. ప్ర‌తి అడుగును ఆచితూచి వేస్తున్నారు. చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను సూటిగా చేస్తున్నారు. ఎక్క‌డా త‌డ‌బాటు లేదు.. ఎక్క‌డా నాన్చుడు లేదు. గ‌తంలో తెలంగాణ కోసం.. కొట్లాడిన స్ఫూర్తి... ఆయ‌న‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు అవలంభిస్తున్న విధానాలు రాష్ట్రాల‌కు ప్రాణ‌సంక‌టంగా మారాయ‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇలానే చూస్తూ.. కూర్చుంటే.. ఉప‌యోగం లేద‌ని చెబుతున్నారు.

అంతేకాదు.. కేంద్రం..  రేపు రాష్ట్రాల‌పైనా పెత్త‌నం మితిమీరుతుంద‌ని.. ప్ర‌జాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్ర‌భుత్వాలు చెల్ల‌ని పెంకులుగా మారిపోతాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో ముందుకు సాగ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు ఇచ్చారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క ప్ర‌ధాన విప‌క్షం జ‌న‌తాద‌ళ్ అధినేత‌, మాజీ ప్ర‌ధాని దేవెగౌడ మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టారు.

త‌మిళ‌నాడు అధికార ప‌క్షం డీఎంకే మ‌ద్ద‌తును సంపాయించుకున్నారు. ఇక‌, బిహార్ ప్ర‌తిప‌క్షం మ‌ద్ద‌తును కూడా సాధించారు. బెంగాల్ అధికార ప‌క్షం, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీతోనూ క‌లిసి ప‌నిచేసేందుకు ముందుకు వ‌చ్చారు. ఇక‌, ఒడిసా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ను కూడా త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

ఇలా.. క‌లిసి వ‌చ్చిన ప్ర‌తిపార్టీతోనూ ముందుకు సాగుతున్నారు. అయితే.. ఏ నాయ‌కుడికైనా అంతిమ ల‌క్ష్యం.. ఉన్న‌త‌స్థానాన్ని అధిరోహించ‌డ‌మే. అంటే.. కేసీఆర్ ఇంత ప్ర‌యత్నం వెనుక ఉన్న ల‌క్ష్యం ప్ర‌ధాని పీఠంపై కూర్చోవ‌డ‌మే. దీనిలో ఎలాంటి శ‌ష‌భిష‌లు లేవు.

 మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నెర‌వేరుతుంది?  ఏమేర‌కు ఆయ‌న ప్ర‌ధాని పీఠం ఎక్కే ఛాన్స్ ద‌క్కించుకుంటారు? అనేది కీల‌కంగా మారింది. ఎందుకంటే.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఉన్న ఎంపీ స్థానాలు.. 17. అయితే.. వీటిలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ సాధించే సంఖ్యాబ‌లాన్ని బ‌ట్టి ప్ర‌ధాని పీఠంపై ఆశ‌లు నెర‌వేరే అవకాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎందుకంటే.. ఇదే ప్ర‌ధాని పీఠంపై క‌న్నుతో.. మ‌మ‌తా బెన‌ర్జీ కూడా దూకుడుగా ఉన్నారు. అక్క‌డ ఎంపీ స్థానాలు 41. గ‌త ఎన్నిక‌ల్లో 35 స్థానాల‌ను మ‌మత త‌న ఖాతాలో వేసుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎంత లేద‌న్నా 30కి త‌గ్గ‌వు. ఇక‌, త‌మిళ‌నాడులోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. ఒడిసా కూడా ఇంతే. అంటే. . కేసీఆర్ సంఖ్యా బలంక‌న్నా కూడా.. ఇత‌ర ప్రాంతీయ పార్టీల సంఖ్యాబ‌లం ఎక్కువ‌గా ఉంటే.. కేసీఆర్ ఆశ‌లు ఏమేర‌కు నెగ్గుతాయి.. అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అంతేకాదు.. ఇక్క‌డ మ‌రో విష‌యం కీల‌కంగా మారింది.

గ‌తంలోనూ ఇలాంటి ప్ర‌త్యామ్నాయ పార్టీలు అనేకం తెర‌మీదికి వ‌చ్చాయి. అయితే.. అప్పుడు కూడా ప్ర‌ధాని పీఠం కోసం సాగిన పోటీలోనే వీగిపోయాయి. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి కాకుండా.. ప్ర‌ధాని పీఠం ల‌క్ష్యం ప‌క్క‌న పెట్టి.. మోడీని గ‌ద్దె దింపుడే ల‌క్ష్యం అన్న‌ట్టుగా సాగితే.. మాత్రం కేసీఆర్ వ్యూహం ఫ‌లించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News