సూపర్ ట్యూస్ డే -2లోనూ వారిద్దరే ముందంజ

Update: 2016-03-16 07:20 GMT
ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న అమెరికా ప్రైమరీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. సూపర్ ట్యూస్ డే -2 అభివర్ణిస్తున్న తాజా ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష స్థానానికి ఫైనల్ అభ్యర్థులుగా బరిలోకి దిగాలనుకుంటున్న రిపబ్లికన్.. డెమొక్రాటిక్ అభ్యర్థుల మధ్య పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐదు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు సాగాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డోనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ ల తరఫున హిల్లరీ క్లింటన్ ముందంజలో నిలవటం గమనార్హం.

అయితే.. మొత్తం ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఐదింటిలో ఐదు హిల్లరీ ముందంజలో ఉంటే..  రిపబ్లికన్ ఫైనలిస్ట్ గా నిలవాలని భావిస్తున్న డోనాల్డ్ ట్రంప్ నాలుగు రాష్ట్రాల్లో ముందంజలో ఉండగా.. ఒక రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగిలింది.  
ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే..

 ఫ్లోరిడా.. ఇల్లినాయిస్.. మిస్సోరీ.. నార్త్ కరోలినా.. ఓహియో రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన హిల్లరీ క్లింటన్  అన్ని రాష్ట్రాల్లోనూ ముందంజలో నిలిచారు. కాకుంటే.. ఆమె ప్రత్యర్థి శాండర్స్ రెండు రాష్ట్రాల్లో (ఇల్లినాయిస్.. మిస్సోరీ) పోటాపోటీగా నిలిచారు. ఈ రెండు రాష్ట్రాల్లో హిల్లరీకి 50శాతం ఓట్లు పోలు కాగా.. శాండర్స్ కు 49 శాతం ఓట్లు పోల్ కావటం గమనార్హం.

అదే సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య సాగుతున్న పోరులో.. డోనాల్డ్ ట్రంప్ మూడు రాష్ట్రాల్లో (ఫ్లోరిడా.. ఇల్లినాయిస్.. నార్త్ కరోలినా) ట్రంప్ ముందంజలో నిలవగా.. మిస్సోరిలో  మాత్రం ట్రంప్.. క్రూజ్ కు సరి సమానంగా ఓట్లు (41 శాతం) పోల్ కావటం గమనార్హం. ఇక.. ఓహియోలో మాత్రం ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ రాష్ట్రంలో జాన్ కాసిచ్ విజయం సాధించారు.
Tags:    

Similar News