విదేశీయుల‌కు దిమ్మ తిరిగే షాకిచ్చిన ట్రంప్‌

Update: 2017-08-06 05:49 GMT
సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తుంటారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు.. నిర్ణ‌యాల‌కు పెట్టింది పేరుగా నిలిచే ఆయ‌న‌..  అమెరికా ప్ర‌జ‌లు మాత్ర‌మే త‌న ప్ర‌యారిటీగా చెబుతుంటారు. అమెరిక‌న్ల ప్ర‌యోజ‌నాలు త‌ప్పించి త‌న‌కింకేమీ ముఖ్యం కాద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ఆయ‌న‌.. తాజాగా ఆ త‌ర‌హాలోనే మ‌రో నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

అమెరికాకు వ‌ల‌స వ‌చ్చే వారికి మొద‌టి ఐదేళ్ల పాటు ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాలు వ‌ర్తించ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి వారం జాతిని ఉద్దేశించి రేడియో.. వెబ్ ద్వారా ప్ర‌సంగించే ట్రంప్ తాజాగా త‌న ప్ర‌సంగంలో భాగంగా కీల‌క నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు.

‘మా దేశంలోకి వచ్చాక అయిదేళ్లపాటు మీరు సంక్షేమ పథకాలను పొందలేరు. గత వారాలు - సంవత్సరాలు - దశాబ్దాల్లో మాదిరిగా దేశంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను పొందే పరిస్థితి ఉండదు. మొదటి అయిదేళ్ల పాటు మా సంక్షేమ పథకాలను ఆడ‌గ‌మ‌ని.. ఉప‌యోగించుకోమ‌ని మీరు చెప్పాలి . పెద్ద కలలు కనడం.. ధైర్యం.. సాహసంతో నిర్ణయాలు తీసుకోవడం ఆరంభమయింది. ఈ వారం డౌజోన్స్‌ పారిశ్రామిక సూచి గతంలో లేనంత గరిష్ఠస్థాయికి చేరింది. మేలో నిరుద్యోగిత రేటు గత 16 ఏళ్లుగా లేనంత కనిష్ఠ స్థాయిలో ఉంది. గత త్రైమాసికంలో నిజ స్థూల జాతీయోత్పత్తి 2.6 శాతం మేర పెరిగింది. సంపద తిరిగి అమెరికా తీరాలకు చేరుతోంది. అమెరికా కార్మికులకు, కుటుంబాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణం. అమెరికన్ల కల ఏమిటంటే..మనం ప్రేమించే పని చేయడం.. దానిని మనం ప్రేమించేవారి కోసం చేయడం. చాలా కాలంపాటు ఈ కలకు అంతరాయం కలిగింది" అని వ్యాఖ్యానించారు.

గతంలో వరుసపెట్టి ప్రపంచస్థాయి ప్రాజెక్టులకు విరివిగా నిధులు ఇచ్చేవారని..  మన ఉద్యోగాలు, సంపద ఇతరదేశాలకు తరలేలా చేశారంటూ గ‌త పాల‌కుల విధానాల్ని త‌ప్పు ప‌ట్టారు. వేరే వారి ప్ర‌యోజ‌నాల కోసం సొంత కార్మికులు.. ప‌రిశ్ర‌మ‌ల‌ను నియంత్రించి ప‌న్నులు వేశార‌న్న ట్రంప్‌.. వారి సంపాద‌న సామ‌ర్థ్యాన్ని లాగేసుకున్నార‌న్నారు. అలాంటి రోజుల‌న్నీ పోయాయ‌ని.. అమెరికా ప్ర‌జ‌ల కోసం త‌మ ప్ర‌భుత్వం అవిశ్రాంతంగా ప‌ని చేస్తుందన్నారు.

మొన్న‌టికి మొన్న ప్ర‌తిభ ఆధారంగా (వివిధ అంశాల్లో మార్కుల్ని ప్రాతిప‌దిక‌న‌) గ్రీన్ కార్డును ఇవ్వ‌నున్న‌ట్లుగా ట్రంప్ స‌ర్కారు ప్ర‌క‌టించింది. చారిత్రాత్మ‌క వ‌ల‌స‌ల బిల్లు ప్ర‌కారం ప్ర‌తిభ ఆధారంగా గ్రీన్ కార్డును ఇవ్వ‌టం.. సంక్షేమ ప‌థ‌కాలను దుర్వినియోగాన్ని అరిక‌ట్ట‌టం.. బంధుత్వాల పేరుతో వ‌చ్చే చైన్ వ‌ల‌స‌ల్ని నిరోధించ‌టం ద్వారా అమెరికా కార్మికుల్ని ఆదుకోవ‌టం లాంటి అంశాల్ని తాజా బిల్లులో ప్ర‌ధానాంశాలుగా చెబుతున్నారు. దీనిపై ఇప్ప‌టికే చ‌ర్చ మొద‌లు కాగా.. ట్రంప్ తాజా నిర్ణ‌యం అమెరికాకు వెళ్లాల‌నుకునే విదేశీయుల‌కు మింగుడుప‌డ‌ని రీతిలో మారుతుంద‌న‌టంలో సందేహం లేదు.
Tags:    

Similar News