అమ్మ ద‌వ‌డ మీద 4 రంధ్రాలు అందుకేన‌ట‌

Update: 2018-01-04 04:47 GMT
75 రోజుల పాటు చెన్నై అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందిన అమ్మ జ‌య‌ల‌లిత‌.. అక్క‌డే చివ‌రి శ్వాస విడ‌వ‌టం తెలిసిందే. ఆమె మ‌ర‌ణంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆమె భౌతిక‌కాయాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చిన‌ప్పుడు ఆమె ద‌వ‌డ మీద నాలుగు రంధ్రాలు ఉండ‌టంపై అప్ప‌ట్లో భారీ చ‌ర్చ జ‌రిగింది.
 
అయితే.. అమ్మ మ‌ర‌ణించిన త‌ర్వాత ఆమె మృత‌దేహం చెడిపోకుండా ఉండేందుకు ర‌సాయ‌నిక మిశ్ర‌మాల్ని ఉప‌యోగించిన‌ట్లుగా చెప్పారు. అయితే.. అదెవ‌రు చేశారు? అన్న విష‌యం బ‌య‌ట‌కు రాలేదు. అమ్మ మ‌ర‌ణంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. దానిపై విచార‌ణ జ‌రిపేందుకు హైకోర్టు రిటైర్డ్ జ‌డ్జి ఆరుముగ‌స్వామి క‌మిటీని ఏర్పాటు చేశారు.  ఈ క‌మిటీ ఇప్ప‌టికే ప‌లువురిని విచారించింది.

తాజాగా అమ్మ‌కు ఎంబ్లామింగ్ (మృత‌దేశం చెడిపోకుండా ర‌సాయ‌నాలు ఎక్కించే ప‌ద్ధ‌తి) చేసిన మ‌ద్రాసు మెడిక‌ల్ కాలేజీ అనాట‌మీ విభాగం చీఫ్ వైద్యురాలు సుధా శేష‌య్య‌న్ బుధ‌వారం విచార‌ణ సంఘం ఎదుట హాజ‌ర‌య్యారు.  అమ్మ‌కు అత్యంత స‌న్నిహితురాలైన ఆమె.. క‌మిటీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు.  2016 డిసెంబ‌రు 5న అమ్మ మృతి చెంద‌గా.. ఆ త‌ర్వాతి రోజు ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న కోసం ఆమె మృత‌దేహాన్ని చెడిపోకుండా ఉండేందుకు.. దుర్వాస‌న రాకుండా ఉండ‌టం కోసం ఎంబ్లామింగ్ చేసిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు.

త‌న‌కు అపోలో ఆసుప‌త్రి నుంచి రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో అమ్మ‌కు ఎంబ్లామింగ్ చేయాలంటూ స‌మాచారం వ‌చ్చింద‌న్నారు. దీంతో త‌న వైద్య బృందంతో అపోలోకు వెళ్లిన‌ట్లు  చెప్పారు.  ఎంబ్లామింగ్ లో భాగంగానే జ‌య ఎడ‌మ వైపు ద‌వ‌డ‌కు నాలుగు రంధ్రాలు వేసిన‌ట్లు వెల్ల‌డించారు. మెథ‌నాల్ తో స‌హా వివిధ ర‌సాయ‌నాలున్న ఐదున్న‌ర లీట‌ర్ల మిశ్ర‌మాన్ని ఇంజెక్ష‌న్ల ద్వారా జ‌య మృత దేహంలోకి ర‌క్త‌నాళాల‌కు ఎక్కించిన‌ట్లుగా చెప్పారు. అమ్మ బ‌తికి ఉన్న‌ప్పుడు వైద్యం చేసిన అపోలో.. మ‌ర‌ణించిన త‌ర్వాత ఎంబ్లామింగ్ చేయ‌టం కోసం సుధా శేష‌య్య‌న్ ను పిల‌వ‌టం బాగానే ఉన్నా.. అంత పెద్ద అపోలోలో.. ఆ ప‌ని చేసే వారెవ‌రూ లేరా? ఎందుక‌ని సుధా శేష‌య్య‌న్‌ ను పిలిచార‌న్న దానిపై స్ప‌ష్ట‌త రావ‌టం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News