మాజీ డిప్యూటీ సీఎం ఆస్తులు రూ.5వేల కోట్లా?

Update: 2019-10-11 17:30 GMT
సినిమాటిక్ మలుపులతో తరచూ వార్తల్లోకి వస్తున్న కర్ణాటక రాజకీయంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తాము పట్టిన పంతానికి తగ్గట్లే.. కమలనాథులు కర్ణాటక పగ్గాలు చేపట్టిన తర్వాత..కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురిని టార్గెట్ చేసినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ తాజాగా కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కమ్ సీనియర్ కాంగ్రెస్ నేత జి. పరమేశ్వర్.. మరో మజీ మంత్రి జాలప్ప నివాసాలు.. ఆపీసులు.. వారికి సంబంధించిన వ్యాపార సంస్థల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాలు ఆసక్తికరంగా మారాయి.

కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర్  సొంత జిల్లా అయిన తమకూరులో పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా వ్యాపారంలో ఆయనకు మంచి పేరుంది. ఇప్పుడా విద్యా సంస్థల కార్యాలయాల్లోనూ.. ఆయన ఆఫీసులతో పాటు ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. పరమేశ్వరన్ ను ఐటీ అధికారులు పదకొండు గంటల పాటు సుదీర్ఘంగా విచారించినట్లుగా చెబుతున్నారు.

ఈ సందర్భంగా పరమేశ్వర్ కు సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయనకు తమకూరులోనే కాదు మైసూర్.. మండ్య.. ఆస్ట్రేలియా.. మలేషియాల్లోనూ అనుబంధ సంస్థలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ వ్యాపారాల్లో ఆయనకు దాదాపు రూ.5వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో మాజీ మంత్రి జాలప్పకూ పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఉన్నాయి.

ఆయనకు చెందిన విద్యా సంస్థలతో పాటు.. ఆయన నివాసం.. ఆయన కుమారుడి ఇంట్లోనూ ఒకే సమయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కీలకమైనపత్రాలు.. హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇదంతా రాజకీయ వైరంతోనే బీజేపీ ప్రభుత్వం తమపై దాడులు చేస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు. మరి.. ఇంత భారీగా ఆస్తులు.. పత్రాలు పట్టుకున్న వేళ ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News