కేసీఆర్ ఫోన్ చేశాడు.. హరీష్ ఇంటికొచ్చాడు: డీఎస్

Update: 2020-09-28 17:36 GMT
కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ ఎంపీ అయిన సీనియర్ నేత డీ శ్రీనివాస్ గులాబీ పార్టీలోనూ ఇమడలేక అసమ్మతి రాజేశాడు. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు డీఎస్ దూరంగా ఉంటున్నాడు. డీఎస్ ను సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ నేతలు పార్లమెంట్ స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు. చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న డీఎస్ తాజాగా మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీని వదిలి రావడం దురదృష్టకరమని.. కాంగ్రెస్ పార్టీని వీడుతానని అనుకోలేదన్నారు. తనకు కాంగ్రెస్ ఎంతో గౌరవం ఇచ్చిందని.. ఆ పార్టీని వీడడమే తాను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని డీఎస్ వాపోయారు. కొందరి వల్ల తాను కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యానని డీఎస్ చెప్పారు.

కాంగ్రెస్ నుంచి తాను బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఫోన్ చేశారని.. రాష్ట్రానికి మీ తమ్ముడే సీఎం అని తనతో చెప్పారని పేర్కొన్నారు. ఏ అవసరం ఉన్నా తన వద్దకు రావచ్చని తెలిపారని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు తనపై ప్రభావం చూపాయని.. టీఆర్ఎస్ లో చేరేందుకు దోహదపడ్డాయన్నారు. హరీష్ రావు తన వద్దకు వచ్చి పార్టీలో చేరాలని కోరితే తాను టీఆర్ఎస్ లో చేరానని డీఎస్ తెలిపారు.

పార్టీ మారుతాడనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ గురించి సానుకూలంగా మాట్లాడడం..టీఆర్ఎస్ మోసం చేసిందని డీఎస్ చెప్పడం సంచలనంగా మారింది. ఆయన కొడుకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ బీజేపీలో ఉండడంతో డీఎస్ బీజేపీ వైపు వెళతారా? కాంగ్రెస్ లో చేరుతారా అన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News