సోషల్ మీడియా బ్యాన్.. టీఆర్ ఎస్ ట్విస్ట్!

Update: 2018-08-28 06:45 GMT
ఎన్నికల సంస్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం  ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై దేశంలోని అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతినిధిగా ఎంపీ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కోరిన కోరిక ఆసక్తి రేపింది.

పోలింగ్ కు 48 గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ప్రచారాలకు స్వస్తి పలకాలని రాజకీయ పార్టీలకు అల్టీమేటం జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకూ హోరెత్తిన ప్రచారం.. అక్కడితో ఆగిపోతుంది. టీవీలు - పేపర్లలో కూడా ప్రచార పర్వం ఉండదు. దీంతో ఆ రెండు రోజులు మందు - డబ్బులు సీక్రెట్ గా పంచుతూ పార్టీలు ఓటర్లను పార్టీలు ఆకర్సిస్తాయి.

కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి మరో ప్రచారాన్ని కూడా రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయడం సంచలనంగా మారింది.  సోషల్ మీడియాను కూడా ఆ రెండు రోజులు నిషేధించాలని కోరడం దుమారం రేపింది.  ఎన్నికల ప్రచారం ముగిశాక ఉల్లంఘిస్తే  పార్టీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అలానే సోషల్ మీడియాపై కూడా అదేవిధమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ వినోద్ కోరారు. అలాగే ఎంపీ - ఎమ్మెల్యేలకు ఎన్నికల ఖర్చుపై పరిమితి ఉన్నట్టే.. ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చులపై పరిమితులు విధించాలని కోరారు.  ఇక మహిళలకు రాజకీయ పార్టీల వ్యక్తిగత పదవుల్లో రిజర్వేషన్లు ఇచ్చే ప్రతిపాదనకు తమ పార్టీ మద్దతిస్తుందని వినోద్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లున్నాయి. వాట్సాప్ - ఫేస్ బుక్ వాడడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తుంటారు. దేశంలోని 70 కోట్ల మందిని కేంద్ర ఎన్నికల సంఘం నియంత్రించాలంటే సాధ్యం కాని పని.. ఇలా చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ హరించడమే. టీఆర్ఎస్ కోరిన కోరిక నెరవేర్చడం అసాధ్యమే.. అయినా నెటిజన్లకు షాకివ్వాలని టీఆర్ ఎస్ చేసిన ప్రతిపాదనపై ఇప్పుడు అదే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Tags:    

Similar News