ఈడీ విచారణలో ఆమె వ్యక్తిగత రిలేషన్లపై ప్రశ్నలు?

Update: 2022-09-23 00:30 GMT
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారి.. దీదీ సర్కారు ఇమేజ్ ను భారీగా దెబ్బ తీసిన టీచర్ల రిక్రూట్ మెంట్ స్కాం గురించి తెలిసిందే. ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించారన్న బెంగాల్ మాజీ విద్యా శాఖా మంత్రి పార్థ ఛటర్జీతో పాటు ఆయనకు స్నేహితురాలు.. నటిగా సుపచిరితురాలైన అర్పితా ముఖర్జీ ఇంట్లో తనిఖీలు నిర్వహించటం.. ఆ సందర్భంగా కోట్లాది రూపాయిల నోట్ల కట్టలు దొరకటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రిగారు పదవి కోల్పోయి జైలుకు వెళితే.. భారీ సొమ్ములు తన ఇంట్లో దొరికిన నేపథ్యంలో ఆమె కూడా జైలుకు వెళ్లక తప్పలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ స్కాంకు సంబంధించిన విచారణను చేపట్టిన ఈడీ..నటి అర్పితా ముఖర్జీని లోతుగా విచారించిన వైనం బయటకు వచ్చింది. మాజీ మంత్రితో ఆమెకున్న వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన ప్రశ్నల్ని సంధించినట్లుగా తెలుస్తోంది.

అదెలా సాధ్యమన్న దానికి.. తగిన కారణాన్ని ఈడీ అధికారులు చూపించినట్లుగా తెలుస్తోంది. పార్థ ఛటర్జీ తీసుకున్న బీమా పత్రాల్లో నామినీగా అర్పితా ముఖర్జీ పేరు పెట్టటంపై ఆమెను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

మాజీ మంత్రితో అర్పితా ముఖర్జీ లివింగ్ రిలేషన్ లో ఉన్నారా? అన్న ప్రశ్నల్ని సంధించగా.. ఆమె నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని చెబుతున్నారు. ఆమెకు చెందిన రెండు ఇళ్ల నుంచి రూ.49.8 కోట్ల నగదు.. బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్న వైనంపై ఆమెను ప్రశ్నించిన అధికారులకు.. అవేమీ తనకు సంబంధించినవి కావన్న విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది.

విచారణలో భాగంగా తొలుత భారీ నగదు గురించి బంగారు ఆభరణాల గురించి ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదని.. ఆ తర్వాత కొన్ని వివరాలు వెల్లడించినప్పటికీ వివరంగా లేవని చెబుతున్నారు. పార్థ ఛటర్జీకి అక్టోబరు 5వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం అర్పితా ముఖర్జీకి మాజీ మంత్రికి మధ్యనున్న సంబంధాల్ని తెలిపే మరో పత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. పార్థ ఛటర్జీ ట్రేడ్ లైసెన్సును ఉపయోగించి.. ఒక షాపింగ్ మాల్ లో సభ్యత్వాన్ని అర్పితా తీసుకున్న వైనాన్ని గుర్తించారు. విచారణ వేళ ఈడీ విచారణ చేసిన విధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News