ఇంతకీ ఆ రు. 50 కోట్లు ఎవరివి?

Update: 2022-08-01 05:25 GMT
ఆరురోజుల క్రితం పశ్చిమబెంగాల్లో  సినీనటి, పరిశ్రమల శాఖ మంత్రి పార్ధా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీగా డబ్బు పట్టుబడింది. రెండువిడుతలుగా పట్టుబడిన రు. 50 కోట్లు+5 కిలోల బంగారంతో తనకేమీ సంబంధంలేదని చెప్పేసింది. తనింటిని మంత్రి పార్ధా చటర్జీ ఒక బ్యాంకులాగ వాడుకున్నారంటు మండిపడింది. తనింట్లోని ఒక గదిని మంత్రి పూర్తిగా ఆక్రమించుకున్నారని ఆ గదిలోకి తనకు కూడా ఎంట్రీలేదని చెప్పింది.

సీన్ కట్ చేస్తే ఎన్ఫార్స్ మెంటు డైరెక్టరేట్ అధికారుల విచారణలో మంత్రి మాట్లాడుతు అసలా డబ్బుకు తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పారు.తనను ఎవరో కుట్రలో ఇరికించినట్లు కూడా మొత్తుకున్నారు.

తనపైన జరిగిన కుట్ర విషయాన్ని కాలమే బయటపెడుతుందని వేదాంతం కూడా మాట్లాడారు. ఇంతకీ అంత డబ్బు ఎందుకు ఆ ఇంట్లో ఉందంటే టీచర్ల నియామకాల్లో భారీఎత్తున డబ్బు వసూలు చేసినందుకేనట.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇల్లు అర్పితా ముఖర్జీది. దొరికిన 50 కోట్ల రూపాయలు అర్పిత ఇంట్లోనే. అయినా ఆ డబ్బుతో తనకేమీ సంబంధంలేదని అర్పిత మొత్తుకుంటోంది. ఆ డబ్బంతా మంత్రిదేనని, తనింటిని మంత్రి బ్యాంకుగా వాడుకుంటున్నట్లు విచారణలో చెప్పింది.

ఇదేసమయంలో మంత్రేమో దొరికినడబ్బుతో తనకు సంబంధమే లేదంటున్నారు. అర్పతి ఇంట్లో టీచింగ్ పరీక్షలు రాసిన వాళ్ళ హాలు టికెట్లు, ఇంటర్వ్యూ కార్డుల జిరాక్స్ కాపీలు కూడా దొరికాయట.

సోదాల్లో అర్పిత పేరుతో ఉన్న డైరీలో ఎవరెవరి నుండి ఎంతెంత డబ్బు వసూలుచేసింది, డబ్బు చేరిన తేదీ, సమయంతో సహా అన్నీ వివరాలు నోట్ చేసుందట. మరి ఆధారాలు ఇంత పక్కగా కనబడుతున్నా ఒకవైపు అర్పిత, మరోవైపు మంత్రి పార్ధాచటర్జీ ఆ డబ్బు తమది కాదంటున్నారు. పట్టుబడిన కోట్లరూపాయలు ఇద్దరిదీ కాకపోతే మరి ఆ డబ్బంతా ఎవరివి ? ఈడీ విచారణలో అన్నీ విషయాలు బయటపడతాయి ఈరోజు కాకపోతే రేపంతే.
Tags:    

Similar News