ఉత్త‌రాఖండ్ హైకోర్టు ఆదేశాలు వింటే షాక్‌

Update: 2017-06-23 12:41 GMT
మార్పు ఎక్క‌డో అక్క‌డ మొద‌లు కావాలి. పాల‌కుల చ‌ర్మం మొద్దుబారిపోయి స్పందించే గుణం అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్న వేళ‌.. కోర్టులు నిర్ణ‌యాత్మ‌కంగా మారి అప్పుడ‌ప్పుడు జారీ చేసే ఆదేశాలు చురుక్కుమ‌నేలా చేస్తుంటాయి. ప్ర‌జ‌ల్ని క‌న్న‌బిడ్డ‌ల్లా చూస్తామ‌ని.. ఇంటికి పెద్ద‌కొడుకులా మార‌తామ‌ని చెప్పే నేత‌ల మాట‌ల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసం ఎంత‌లా ఉంటుంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

అధికారం చేతిలో లేన‌ప్పుడు అన్నీ చేస్తామ‌ని చెప్ప‌ట‌మే కాదు..అవ‌స‌ర‌మైతే ఆల్ ఫ్రీ అని కూడా చెప్పేస్తుంటారు. మ‌రి..అలా మాట‌లు చెప్పే నేత చేతికి అధికారం వ‌స్తే ఎలా ఉంటుందన్న సందేహం అక్క‌ర్లేదు. అలాంటి డౌట్లు తీర్చేలా తాజాగా ఒక అధినేత మాట‌లు వింటే షాక్ తినాల్సిందే. నేను న‌చ్చ‌న‌ప్పుడు.. నా పాల‌న న‌చ్చ‌న‌ప్పుడు నేను వేసిన రోడ్లు.. నేను క‌ల్పించిన స‌దుపాయాల్ని ఎందుకు వాడుకుంటార‌న్న అర్థం వ‌చ్చేలా మాట‌లు చూస్తే అర్థ‌మ‌వుతుంది.. అధికారం ఎంత‌లా త‌ల‌కెక్కేసింద‌న్న‌ది.

ఇలాంటి వారికి ప్ర‌జ‌లు ఎలాగూ చెప్పాల్సిన పాఠాన్ని చెప్పేస్తారు. కానీ.. అప్ప‌టికి చాలానే స‌మ‌యం ప‌డుతుంది. ఇలా అడ్డ‌దిడ్డంగా మాట్లాడే నేత‌ల‌కు.. ప్ర‌జ‌ల అవ‌స‌రాలు ప‌ట్ట‌ని పాల‌కుల‌కు షాక్ ఇచ్చేలా ఉత్త‌రాఖండ్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు చురుకు పుట్టేలా ఉంద‌ని చెప్పాలి. ఇంత‌కీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఏం చెప్పింద‌న్న‌ది చూస్తే.. ఆ రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు క‌నీస స‌దుపాయాలు కూడా క‌ల్పించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై తాజాగా దాఖ‌లైన పిటీష‌న్‌ను విచారించిన హైకోర్టు సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది.

అదేమంటే.. ఆ రాష్ట్రం కార్లు.. మొబైల్‌ఫోన్లు లాంటి ల‌గ్జ‌రీ వ‌స్తువుల్ని కొనుగోలు చేయ‌కుండా బ్యాన్ విధించింది.  త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కు రాష్ట్ర స‌ర్కారు కార్లు.. ఫోన్ల‌తో పాటు ఫ‌ర్నిచ‌ర్‌.. ఏసీలు.. లాంటివేమీ కొనుగోలు చేయొద్ద‌ని స్ప‌ష్టం చేసింది. విద్యార్థుల‌కు క‌నీస స‌దుపాయాలు క‌ల్పించ‌లేని ప్ర‌భుత్వం ల‌గ్జ‌రీ వ‌స్తువుల‌పై డ‌బ్బులు ఖ‌ర్చు చేసే నైతిక‌హ‌క్కు లేద‌ని తేల్చింది. దీప‌క్ రాణా అనే వ్య‌క్తి హైకోర్టులో వేసిన పిటీష‌న్ పై విచారణ జ‌రిపిన హైకోర్టు తాజాగా సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. ఇదే త‌ర‌హాలో దేశ వ్యాప్తంగా ఉత్త‌ర్వులుజారీ అయ్యేలా సుప్రీం కానీ ఆదేశాలు జారీ చేస్తే ప్ర‌భుత్వాల‌కు కాస్త అయినా చురుకు వ‌స్తుందేమో? మ‌రి.. ఈ ఆదేశాల‌పై ఉత్త‌రాఖండ్ అధికార‌ప‌క్షం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News