కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే భేటీ.. ఏం జరగనుంది?

Update: 2021-06-15 03:08 GMT
‘అనవసరంగా ఆట మొదలు పెట్టొద్దు. నువ్వు ఒక ఎత్తు వేస్తే.. నీ ప్రత్యర్థి ఉత్తినే ఊరుకోడు కదా? రెండు ఎత్తులు వేస్తాడు. నీ ప్రత్యర్థికి నష్టం జరిగిందన్న సంతోషం వద్దు.. ఎందుకంటే.. అదే నష్టం.. ఆ మాటకు వస్తే అంతకు మించిన నష్టం నీకూ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే.. ఆట మొదలు పెట్టటం ఎవరికి మంచిది కాదు’ అన్న మాటలు రాజకీయ రంగంలో తల పండిన వారి నోటి నుంచి వినిపించే మాటలు. భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి పక్కన పెట్టేయటం.. కేసులు.. విచారణతో ఈటలను ఉక్కిరిబిక్కిరి చేసిన దానికి ఫలితాన్ని సీఎం కేసీఆర్ ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏళ్లకు ఏళ్లుగా పెంచుకుంటూ వచ్చిన పరపతి.. అంతకు మించిన ఇమేజ్ కేసీఆర్ కారణంగా పోయిందన్న ఆవేదనను ఈటల వ్యక్తం చేస్తున్నారు. తన సన్నిహితుల వద్ద ఈటల ఆవేదనతో పాటు.. ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా చెబుతున్నారు. తనకు ఎదురైన అవమానాల్ని ఊరుకునేది లేదన్నమాట ఆయన నోట వచ్చినట్లు చెబుతున్నారు. తనను టార్గెట్ చేస్తే ఫర్లేదని..దాన్నిరాజకీయమని సర్ది చెప్పుకోవచ్చని.. కానీ తన భార్య.. కొడుకును లక్ష్యంగా చేసుకోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇందుకు తగ్గట్లే.. ఈటల మాటలోనూ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు ఆచితూచి అన్నట్లు మాట్లాడిన ఆయన.. బీజేపీలోకి చేరినంతనే మాటలో మార్పు వచ్చేసింది. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని చెబుతున్నారు. బీజేపీలోకి చేరిన తర్వాత ఆయన అనూహ్యమైన అడుగు వేశారు. కేంద్రజలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు.

సోమవారం రాత్రి వేళలో ఆయన్నుకలిసి ఈటల.. అరగంట పాటు మాట్లాడారు. బీజేపీలో చేరింతనే కేంద్రమంత్రి అపాయింట్ మెంట్ లభించటం ఒక కీలక అంశం అయితే.. ఈ భేటీలో ఈటల ఏం మాట్లాడి ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతి గురించిన వివరాలు చెప్పి ఉంటారని భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. సీఎం కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైనట్లేనన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News