రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆ దేశాధ్యక్షుడు!

Update: 2022-11-27 08:30 GMT
జనవరి 26న జరిగే భారత రిపబ్లిక్‌ దినోత్సవానికి ఈసారి ఈజిప్టు దేశాధ్యక్షుడు రానున్నారు. ఈ మేరకు భారత రిపబ్లిక్‌ దినోత్సవాలకు హాజరు కావాలని మన దేశం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌ సిసిని ఆహ్వానించింది. ఈ మేరకు అక్టోబర్‌లో ఈజిప్టులో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌.. ఆ దేశ అధ్యక్షుడిని రిపబ్లిక్‌ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు.

కాగా ఈజిప్టు అధ్యక్షుడు భారత్‌ రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు హాజరైతే.. ఆ దేశ అధ్యక్షుడు భారత్‌ రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు హాజరు కావడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా కరోనా విజృంభణతో 2021, 2022ల్లో భారత్‌ రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు విదేశీ అతిథులు ఎవరినీ ఆహ్వానించలేదు.

భారత్‌ రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు విదేశాల అధ్యక్షులు, ప్రధానులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించే ఆనవాయితీ ఎన్నో ఏళ్లుగా వస్తోంది. ఇప్పటివరకు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు భారత్‌ రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా ఈసారి ఈజిప్టు అధ్యక్షుడిని ముఖ్య అతి«థిగా ఆహ్వానించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఈజిప్టుతో మొదటి నుంచి భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత్‌కు లానే ఈజిప్టుకు సైతం పురాతన నాగరికతలు ఉన్నాయి. అలీన దేశాల కూటమిలో మొదటి నుంచి ఈజిప్టు భాగస్వామిగా ఉంది. ముఖ్యంగా చమురు, సహజవాయువు వ్యాపారం ప్రపంచంలోనే ఎక్కువగా సూయజ్‌ కాలువ ద్వారా జరుగుతుంది. ఈ సూయజ్‌ కాలువ ఈజిప్టు కిందనే ఉంది.

భారతదేశ అవసరాలకు చమురు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూయజ్‌ కాలువను దిగ్భందిస్తే భారత్‌కు చమురు దిగుమతులు ఆగిపోతాయి.

అదేవిధంగా ఆఫ్రికాలో ముఖ్య పర్యాటక దేశంగా, ముఖ్య దేశాల్లో ఒకటిగా ఈజిప్టు ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు ఆ దేశంలోనే ప్రవహిస్తోంది. ఇక ఈజిప్టులో ముఖ్య పర్యాటక ప్రదేశం పిరమిడ్లను సందర్శించానికి ఏటా కొన్ని లక్షల మంది భారతీయులు ఈజిప్టు వెళ్తుంటారు.
ఈ నేపథ్యంలోనే ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌ సిసిని భారత్‌ రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు ఆహ్వానించింది.
Tags:    

Similar News