భారతీయ జనతా పార్టీకి ఊరటను ఇచ్చిన ఎన్నికల సంఘం!

Update: 2019-09-27 05:46 GMT
కర్ణాటకలో ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ భారతీయ జనతా పార్టీకి ఊరటను ఇచ్చింది ఎన్నికల సంఘం. ఇటీవలే అనర్హతకు గురి అయిన 15 మంది ఎమ్మెల్యేల సీట్లకు ఉప ఎన్నికల  నోటిఫికేషన్ ను ఇటీవలే ఈసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఉప ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. రేపోమాపో అభ్యర్థులు నామినేషన్ వేసి, ప్రచారం మొదలుపెట్టాల్సిన సమయంలో.. ఈసీ ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్నయం తీసుకుంది. ఈ వాయిదా భారతీయ జనతా పార్టీకి రిలీఫ్ అని అంటున్నారు పరిశీలకులు.

కాంగ్రెస్-జేడీఎస్ లకు తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు గురై ఇప్పుడు ఉప ఎన్నికలకు కారణమైన వారంతా భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులుగా మారారు. వారి తిరగుబాటు వల్లనే బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారంతా బీజేపీ తరఫున ఆయా సీట్లలో పోటీ చేయాలని అనుకున్నారు. అయితే అనర్హత వేటు వేసి వెళ్లిన స్పీకర్ వారి పై పోటీకి కూడా అనర్హత వేటు వేశారు. ఉప ఎన్నికల్లోనేగాక మరో నాలుగేళ్ల పాటు వాళ్లు ఏ రకమైన ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అవకాశం లేకుండా స్పీకర్  రమేశ్ కుమార్ అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చి, తన పదవికి రాజీనామా చేసివెళ్లారు. అది బీజేపీకి - దాని సానుభూతి పరులకు గట్టి ఝలక్ అయ్యింది.

ఇంతలోనే ఈసీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఆ మాజీలు కోర్టుకు ఎక్కారు. తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని వారు కోరారు. వారి పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో ఉప ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. ప్రస్తుతానికి ఇది బీజేపీకి, దాని అనుకూలురు అయిన  అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలకు ఊరటను ఇస్తున్న అంశమే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Tags:    

Similar News