ఎంత దారుణం: ఒక్క‌రూ సాయ‌ప‌డ‌లేదు

Update: 2017-09-29 18:17 GMT
మాయ‌మైపోతున్న‌డ‌మ్మా.. మ‌నిష‌న్న‌వాడు.. - అన్న సినీ క‌వి మాట‌లు నిజ‌మ‌య్యాయి. ముంబైలో ఈ రోజు ఉద‌యం జ‌రిగిన ఘోర తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న త‌ర్వాత బాధితుల ఆర్త‌నాదాలు ఆకాశాన్ని అంటుతున్నా కూడా ఏ ఒక్క‌రూ సాయం చేసేందుకు ముందుకు రాలేద‌ట‌! దీంతో ప్రాణ న‌ష్టం భారీగా పెరిగి దాదాపు 27 మంది మ‌ర‌ణించార‌ని, ఎవ‌రైనా స్పాట్‌లో సాయం చేసి ఉంటే.. ప్రాణాపాయం ఇంత‌గా ఉండేది కాద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షి ఒక‌రు వెల్ల‌డించారు. ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ రోడ్ రైల్వే స్టేష‌న్‌లో ఉన్న ఫుట్ ఓవ‌ర్ వంతెన‌పై ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో భారీ తొక్కిస‌లాట జ‌రిగిన విష‌యం తెలిసిందే.

భారీ వ‌ర్షం, దానికితోడు విప‌రీత‌మైన ర‌ద్దీ కార‌ణంగా స‌హాయ కార్య‌క్ర‌మాల‌కు తీవ్ర ఆటంకం ఏర్ప‌డింద‌ని పోలీసులు చెప్పారు. ఇదిలావుంటే, ప్ర‌త్య‌క్ష‌సాక్షుల క‌థ‌నం మేర‌కు.. విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ జ‌రిగింద‌ని, జ‌నాలు భారీగా చేర‌డంతో వంతెన విరిగిపోయే స్థాయికి చేరిపోయింద‌ని పెద్ద ఎత్తున వ‌దంతులు వ్యాపించ‌డంతోనే ఈ తొక్కిస‌లాట జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు. మ‌రికొంద‌రు ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నం మేర‌కు భారీ వ‌ర్షం కురుస్తున్న కార‌ణంగా అంద‌రూ బ్రిడ్జిపై ఆగిపోయార‌ని, భారీ సంఖ్య‌లో చేర‌డానికి తోడు వ‌దంతులు కూడావ్యాపించాయ‌ని అన్నారు. దీంతో జ‌నాలు త‌లో దిక్కుగా ప‌రిగెట్టార‌ని, ఇదే తొక్కిస‌లాట‌కు కార‌ణ‌మైంద‌ని అన్నారు.

ఒక విధంగా తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితిలోనే ప్ర‌యాణికులు అటు ఇటు ప‌రుగులు తీశార‌ని, ఈ క్ర‌మంలోనే కొంద‌రు త‌మ ప్రాణాల‌ను ర‌క్షించుకునేందుకు వంతెన‌పై నుంచి కింద‌కి దూకార‌ని చెప్పారు. కాగా, ఇక‌, తొక్కిస‌లాట‌లో కొన‌వూపిరితో ఉన్న‌వారికి స‌మ‌యానికి ఎలాంటి వైద్య‌మూ అంద‌లేద‌ని దీంతో ప్రాణ‌న‌ష్టం భారీగా జ‌రిగింద‌ని చెప్పారు.  ప్ర‌త్య‌క్ష సాక్షి.. గంగాధ‌ర్ మండ‌ల మాట్ల‌డుతూ.. రైల్వే స్టేష‌న్‌లో భారీ వ‌ర్షం కురుస్తుండ‌డంతో ప్ర‌తి సెక‌నుకు జ‌నాభా సంఖ్య పెరిగింద‌ని, అదేస‌మ‌యంలో రెండు రైళ్లు స్టేష‌న్‌లోకి వ‌చ్చాయ‌ని, దీంతో మ‌రింత ర‌ద్దీ పెరిగింద‌ని చెప్పారు. ఫ‌లితంగా ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిపై ప్ర‌యాణికుల ర‌ద్దీ అంత‌కంత‌కు పెరిగి.. చివ‌రికి తొక్కిస‌లాట‌కు దారితీసింద‌న్నారు.  ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో పోలీసులు కానీ, రైల్వే సిబ్బంది కానీ స్పాట్‌లో లేర‌ని, ముందే వాళ్లు చ‌ర్య‌లు తీసుకుని ఉంటే.. ఇంత మంది మృతి చెందేవారు కార‌ని అన్నారు. మొత్తంగా ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నం మేర‌కు అధికారుల వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.


Tags:    

Similar News