అర్థరాత్రి వేళ ఏలూరులో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

Update: 2022-04-14 03:29 GMT
ఏపీలోని ఏలూరులో బుధవారం అర్థరాత్రి సమయంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆరుగురి నిండు ప్రాణాల్ని తీసిన ఈ దారుణ ఉదంతం షాకింగ్ గా మారింది. రసాయన పరిశమ్రలో అనూహ్యంగా చెలరేగిన మంటల ధాటికి రియాక్టర్ పేలిపోవటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. అసలేం జరిగిందంటే..

ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలో పోరస్ రసాయ పరిశ్రమ ఉంది. ఈ ఇండస్ట్రీలో ఔషధాల్లో వాడే పొడిని ఉత్పత్తి చేస్తుంటారు. బుధవారం అర్థరాత్రి వేళ యూనిట్ 4లో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. చూస్తుండగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రియాక్టర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవ దహనం కాగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు.

ఈ ఘోరం చోటు చేసుకునే సమయంలో పరిశ్రమలో దాదాపు యాభై మంది వరకు పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రాధమిక సమాచారం ప్రకారం ఈ అగ్నిప్రమాదం కారణంగా 13 మందికి తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. బాధితులకు మెరుగైన వైద్య సాయం కోసం విజయవాడకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. . మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు.

అగ్నిప్రమాదం జరిగిందన్న సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్ని ముమ్మరంగా చేపట్టారు. దాదాపు గంటకు పైనే శ్రమించిన అనంతరం మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
Tags:    

Similar News