గోవాలో ఎంట్రీ అంత ఈజీ కాదు సుమీ !

Update: 2022-02-12 07:58 GMT
గోవాలో ద‌శాబ్దాలుగా గెలుపు కోసం పోరాడుతున్న శివ‌సేన ఈ సారైనా ఆ ఆశ నెర‌వేర్చుకుంటుందేమో చూడాలి. 1989 నుంచి గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించ‌లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా బోణీ కొట్టాల‌నే కృత‌నిశ్చ‌యంతో క‌నిపిస్తోంది. ఉద్యోగాల్లో అధిక భాగం స్థానికుల‌కే ద‌క్కాలంటూ త‌మ‌కు మ‌రాఠా గ‌డ్డ‌పై క‌లిసొచ్చిన భూమి పుత్ర‌ల నినాదంతో గోవాలో ముందుకెళ్లాల‌ని శివ‌సేన ప్ర‌య‌త్నిస్తోంది.

మ‌రాఠాల ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా 1966లో శివ‌సేన ఆవిర్భ‌వించింది. మ‌హారాష్ట్రలో బ‌ల‌మైన పార్టీగా ఎదిగింది. ఆ రాష్ట్రంలో ప్ర‌స్తుతం మ‌హా వికాస్ అఘాడీ కూట‌మిలో భాగంగా అధికారంలో ఉంది. గోవాలోనూ మ‌రాఠీ మాట్లాడేవారి సంఖ్య ఎక్కువే. దీంతో ఆ రాష్ట్రంలోనూ పుంజుకోవాల‌ని శివ‌సేన ద‌శాబ్దాలుగా ప్ర‌య‌త్నిస్తోంది. కానీ ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ నిరాశే ఎదురైంది.

1989 నుంచి మొద‌లు 2017 వ‌ర‌కు ప్ర‌తిసారి ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నా ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక‌పోయింది. అయితే గోవాలో ఆ పార్టీ ఎద‌గ‌క‌పోవ‌డానికి కారాణాలున్నాయి. ఇక్క‌డ ఆ పార్టీ వ్య‌వ‌స్థాగ‌త నిర్మాణంపై దృష్టి పెట్ట‌లేద‌నే చెప్పాలి.

మ‌రోవైపు గోవాలో మ‌హారాష్ట్రవాదీ గోమంత‌క్ పార్టీ (ఎంజీపీ) ఉండ‌డంతో శివ‌సేన ఎద‌గ‌డానికి అవ‌కాశం లేకుండా పోయింది. గోవాను మ‌హారాష్ట్రలో విలీనం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఏర్ప‌డిన ఎంజీపీ 1963 నాటి గోవా తొలి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి వ‌చ్చింది. అయితే అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌ట్ట‌గా మెజార్టీ వ‌ర్గాలు విలీనాన్ని వ్య‌తిరేకించాయి. అయితే ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లోనూ ఎంజీపీనే అధికారం ద‌క్కించుకుంది.

ఇక మ‌హారాష్ట్ర బ‌య‌ట శివ‌సేన ప్ర‌భావం అంతంత‌మాత్రంగానే ఉంది. దాద్రాన‌గ‌ర్‌హ‌వేలీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఆ పార్టీ నుంచి క‌ళాబెన్ దేల్క‌ర్ ఎంపీగా గెలిచారు. మ‌హారాష్ట్ర బ‌య‌ట దేశంలో ఆ పార్టీకి ద‌క్కిన ఏకైక ఎంపీ సీటు ఇదే.

కానీ ఈ సారి ఎన్నిక‌ల్లో మాత్రం ప్ర‌భావం చూపాల‌నే ప‌ట్టుద‌ల‌తో శివ‌సేన ఉంది. మ‌హారాష్ట్రలో మ‌హా వికాస్ అఘాడి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో క‌లిసి ప్ర‌స్తుతం గోవా ఎన్నిక‌ల్లో శివ‌సేన పొత్తు పెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా.. శివ‌సేన 10, ఎన్సీపీ 13 చోట్ల పోటీ చేస్తున్నాయి. మ‌రి ఈ సారైనా శివ‌సేన క‌ల తీరుతుందేమో చూడాలి. ఒక్క స్థానంలోనైనా ఆ పార్టీ గెలుస్తుందా? అన్న‌ది ఆస‌క్తి రేపుతోంది.
Tags:    

Similar News