ఈటలపై లేఖ: మావోయిస్టుల సంచలనం

Update: 2021-06-16 15:50 GMT
టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఘాటు లేఖ రాశారు మావోయిస్టులు. తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది.

ఈటల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను తెలంగాణ మావోయిస్టు పార్టీ ఖండించింది. తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తూ కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడుతానని.. అందుకోసం ఆర్ఎస్ఎస్ నుంచి పోరాడాలని ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసి హిందుత్వ పార్టీ అయిన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని వారు మండిపడ్డారు.

ఇది కేసీఆర్, ఈటల మధ్య జరుగుతున్న అంతర్గత వ్యవహారం అని.. తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం కాదని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. వారు ఒకే గూటి పక్షులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. కేసీఆర్, ఈటల అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారని.. వీరి పాలన ప్రజా వ్యతిరేకమైనదని అన్నారు.

మొన్నటివరకు కేసీఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటల.. తన ఆస్తుల పెంపుదలకు ప్రయత్నించారని విమర్శించారు. అందుకే పేదల భూములు ఆక్రమించారని ఫైర్ అయ్యారు. తన ఆస్తుల రక్షణ కోసం నేడు బీజేపీలో ఈటల చేరాడని.. మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రజలకు తెలియజేశారు. ఈటల నిర్ణయాన్నితెలంగాణలోని ప్రజలు ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
Tags:    

Similar News