అందరూ మాజీలు కావాల్సిందే.....ఇదే ఫైనల్...?

Update: 2022-04-07 07:53 GMT
ఏపీలో మంత్రి వర్గ విస్తరణ కాదు కానీ వైసీపీలో హై టెన్షన్ హీట్ కనిపిస్తోంది. ఎవరిని చూసినా అదే వాతావరణం. మాజీలు ఎవరు, తాజాలు ఎవరు. ఈ లెక్కలు ఎప్పటికీ తేలనివే. బుర్ర బద్ధలు కొట్టుకున్నా అర్ధం కానివే. లీకవుతున్న వార్తలు బోలెడు బయటకు వస్తున్నాయి. అందుకో ఏది రైట్. ఏది రాంగ్. దీని చెప్పగలిగే వారు అయితే లేదు.

ఎందుకంటే జగన్ మనసులోనే లిస్ట్ ఉంది. ఆయన రివీల్ చేస్తేనే తప్ప ఎవరికీ ఏమీ తెలియదు. ఈ లోగా మీడియాలో వస్తున్న విశ్లేషణలు, చర్చలు మాత్రం మంత్రులతో పాటు ఆశావహులను హీటెక్కించేస్తున్నాయి. మొత్తం మంత్రి వర్గం అవుట్ అని కొందరు చెబుతూంటే నలుగురు కొనసాగుతారని కొన్ని పేర్లు చెబుతున్నారు. కాదు కాదు అయిదుగురు మంత్రులను కంటిన్యూ చేస్తారని కూడా మరో వైపు న్యూస్ వస్తోంది.

సీనియర్ల సీట్లు పదిలం మరి ఇంకో వార్త. అసలు తొంబై శాతం అంటే ఎంత. టోటల్ 24లో ఆ ఉండే నంబర్ ఎంత. ఇలా పొలిటికల్ మేధ‌మెటిక్స్ మాస్టర్లు తమదైన శైలిలో కొత్త లెక్కలు చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే సీనియర్లతో పాటు, మాజీలు కాబోతున్న వారి వాదన అయితే మరోలా ఉందిట.

తీసేస్తే మొత్తం అందరినీ తీసేయాలి. కొందరిని ఉంచడమేంటి అన్న చర్చ కూడా బయల్దేరుతోందిట. శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రి సీదరి అప్పలరాజు, తూర్పు గోదావరి నుంచి చెల్లుబోయిన వేణుగోపాల్ తో పాటు పశ్చిమ గోదావరి నుంచి చెరుకువాడ శ్రీరంగనాధ్ పేర్లు కూడా ఉండేవారిలో ఇపుడు చేర్చేశారు. ఇక కర్నూల్ నుంచి జయరాం, అలాగే ప్రకాశం నుంచి ఆదిమూలపు సురేష్ కూడా కంటిన్యూ అవుతారని వార్తలు వస్తున్నాయి.

అంటే ఈ నంబర్ అయిదుకు పెరిగింది. వీలుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఇలా చూసుకుంటే ఎనిమిది మంది మంత్రులు కంటిన్యూ అవుతారు అని కూడికలు తీసివేతల తరువాత చెప్పేస్తున్నారు.

దీంతో ఆయా జిల్లాలలో ఉన్న ప్రస్తుత మంత్రులతో పాటు, అక్కడ తమ బెర్త్ కోసం రేసులో ఉన్న ఆశావహులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు అని టాక్. అందరినీ మాజీలను చేసేస్తేనే బెటర్ అన్నది సీనియర్ మంత్రుల మనోగతంగా ఉందని తెలుస్తోంది. లేకపోతే కొందరిని ఉంచడం వల్ల మిగిలిన వారు ఏ తప్పు చేశారో అన్న తప్పుడు సంకేతాలు జనాల్లోకి వెళ్తాయని అంటున్నారు.

దీని మీద ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే తన అసంతృప్తిని దాచుకోలేకపోయారు అన్న ప్రచారం కూడా జరిగింది. మరి ఇదే సీన్ మిగిలిన చోట్లా ఉంది. ఏది ఏమైనా అందరూ మాజీలు కావాల్సిందే. ఇదే ఇపుడు అసలైన నినాదంగా ముందుకు వస్తోంది. మరి జగన్ మార్క్ లెక్కలు ఎలా ఉంటాయో. ఆయన ఎవరిని కంటిన్యూ చేస్తారో చూడాల్సిందే.
Tags:    

Similar News