ఈ మాజీ ఎమ్మెల్యే సంగ‌తి చూడండి కేసీఆర్‌

Update: 2017-05-30 17:36 GMT
రాజ‌కీయాల్లో ఉన్నోళ్లంతా ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌తార‌ని.. కోట్లాది రూపాయిలు వెన‌కేసుకుంటార‌ని చాలామంది అనుకుంటారు. కానీ.. రాజ‌కీయాల్లోనూ నీతిగా.. నిజాయితీగా బ‌తికే వారుంటారు. కాకుంటే.. ఇలాంటి వారు చాలా చాలా త‌క్కువ‌గా ఉంటారు. కానీ.. ఇలాంటి వారి ప‌రిస్థితి.. వారి క‌ష్టాలు చూస్తే.. అయ్యో అనుకోవాల్సిందే. తాజాగా అలాంటి ఓ మాజీ ఎమ్మెల్యే ఉదంతం వింటే వేద‌న‌కు గురికావాల్సిందే. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. ప‌వ‌ర్ లో ఉన్న‌ప్ప‌టికీ  వెన‌కేసుకున్న‌ది ఏమీ లేదు.  విధి ఆడిన వింత నాట‌కంతో బాధితుడిగా మారిన ఆయ‌న‌.. ఇప్పుడు ఒక‌రి అస‌రా లేకుండా బ‌త‌క‌లేని దీన‌స్థితిలో ఉన్నారు. ఇంత‌కీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవ‌రు? ఆయ‌నేం చేస్తున్నారు? ఇప్పుడెలా ఉన్నారు? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే..  

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని ఒక‌ప్ప‌టి దొమ్మాట నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే రామ‌చంద్రారెడ్డి. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ.. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరారు. 1985లో దొమ్మాట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే.. నాటి తెలుగుదేశం పార్టీలో అల్లుళ్ల అధిప‌త్య పోరు న‌డుస్తుండ‌టం.. దీన్ని స‌హించ‌లేని ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించారు. పార్టీలో అల్లుళ్ల పెత్త‌నం స‌రికాద‌న్న గ‌ళాన్ని విప్పారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి.. పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేశారు.

1989లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం త‌న‌కున్న 45 ఎక‌రాల్ని అమ్మేశారు. కానీ.. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాతి కాలంలో ఆయ‌న కొడుకు రామ‌కృష్ణారెడ్డి 2005లో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ‌టం.. నాలుగేళ్లు కోమాలో ఉండి మృతి చెందారు.

ఇలా దెబ్బ మీద దెబ్బ ప‌డ‌టంతో ఆయ‌న ఆర్థికంగా చితికిపోయారు. మ‌రోవైపు మాన‌సికంగానూ బ‌ల‌హీన‌మ‌య్యారు. ఇదిలా ఉంటే అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో గ‌త ఏడాది బైపాస్ స‌ర్జ‌రీ జ‌రిగింది. షుగ‌ర్ తో బాధ ప‌డుతున్న ఆయ‌న కాలి చిటికెన వేలు తీసేశారు. ప్ర‌స్తుతం స‌రిగా మాట్లాడ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న ఆయ‌న‌.. సిద్ధిపేట జిల్లాలోని స్వ‌గ్రామ‌మైన కొండ‌పాక‌లో ఒక పెంకుటింట్లో ఉంటున్నారు. ఆయ‌న స‌తీమ‌ణి సాధార‌ణ జీవితాన్ని గ‌డుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యేల‌కు ఇంటి స్థ‌లం ఇచ్చినా.. నాలుగున్న‌రేళ్ల కే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌టంతో ప్ర‌భుత్వప‌రంగా రావాల్సిన ఇంటిస్థ‌లం కూడా అంద‌లేదు. ఇన్ని క‌ష్టాల్లో ఉన్న రామ‌చంద్ర‌రెడ్డిని ఏదో ర‌కంగా ఆదుకోవాల్సిందే.  ఇలాంటి ఉదంతాలు త‌న దృష్టిలో ప‌డిన వెంట‌నే స్పందించే  తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఈ ఇష్యూలో కూడా స్పందిస్తే బాగుంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News