డ్రగ్స్ కేసు...కాస్త గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ నోటీసులు

Update: 2018-04-07 06:27 GMT
తెలుగు రాష్ర్టాల్లో సంచ‌ల‌నం సృష్టించ‌డ‌మే కాకుండా దాదాపు నెల రోజుల పాటు రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపిన నార్కొటిక్ డ్రగ్స్ (ఎల్‌ ఎ స్‌డి) కేసు ఒకింత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. సినీ ప‌రిశ్ర‌మ‌తో పాటుగా టెక్ ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపిన ఈ కథ కంచికి చేరిన‌ట్లే అనుకున్న చ‌ర్చ‌ల‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ తాజాగా నోటీసులు అందించింది.  డ్రగ్స్‌ కేసులో సిట్‌ మరో ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా సిట్‌ అధికారులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు హీరోలపై అభియోగాలు నమోదయ్యాయి. ఓ దర్శకుడు, ఇద్దరు హీరోలు డ్రగ్స్‌ వాడుతున్నట్లు సిట్‌ పేర్కొంది. ఈ కేసులో మరికొందరి ఫోరెన్సిక్‌ నివేదిక అందాల్సి ఉందని అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత మరికొందరిపై ఛార్జ్‌షీట్‌ వేస్తామన్నారు.

డ్రగ్స్ వినియోగం - విక్రయంతో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఎక్సైజ్ శాఖ అధికారులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ హడావిడి చేయడంతో పాటు పలువురు సినీ ప్రముఖులను కూడా విచారించిన సంగ‌తి తెలిసిందే. ఒక్కో నటుడిని పదేసి గంటలకు పైగా విచారించడం, వారి నుంచి గోళ్ళు, రక్తం, ఉమ్మి తదితర వాటి నమూనాలను తీసుకోవడంతో కేసు తీవ్రతపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఒక దశలో నటులను రెండవ విడత విచారణ కూడా చేయనున్నారన్న వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే కొద్దికాలం త‌ర్వాత కేసు క‌నుమ‌రుగు అయిపోయింది. ఈ కేసుపై ఆరా తీయగా ఎవరినీ విచారించేది లేదని, అరెస్టులు కూడా చేసేది లేదని, కోర్టులలో చార్జిషీట్‌లు దాఖలు చేయడం కూడా అనుమానమేనని ప్ర‌చారం జ‌రిగింది.

సమాజానికి సినిమాల ద్వారా సందేశాన్ని అందిస్తున్న నటులపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ గతంలోనే పలువురు సినీ రంగ ప్రముఖులు వ్యాఖ్యానించడంతో పాటు కొంత మంది ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులను కలిసి విషయం తెలిసిందే. డ్రగ్స్ వినియోగం - విక్రయంతో సినీ రంగంతో ఏ మాత్రం సంబంధం లేదని వారు పేర్కొన్న విషయం కూడా తెలిసిందే. కొంద‌రు సినీ ప్రముఖులు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, పరువు తీయడం సరైంది కాదని ప్రభుత్వంతో విన్న‌వించిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. దీంతో కేసు మూసివేస్తార‌ని భావించారు. అయితే అంచ‌నాల‌కు భిన్నంగా తాజాగా ఫోరెన్సిక్‌ నివేదిక అందడంతో ముగ్గురు వ్యక్తులపై సిట్‌ చార్జ్‌షీటును దాఖలు చేసింది. త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌ని అకున్ స‌బర్వాల్ వెల్ల‌డించ‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌తీసింది.
Tags:    

Similar News