పల్లెల్లో ఫ్యామిలీ డాక్టర్ ... సీఎం జగన్ మరో కీలక నిర్ణయం !

Update: 2020-12-23 06:05 GMT
ఆంధ్రప్రదేశ్‌ లోని గ్రామాల్లో వైద్య సేవల్ని మరింత మెరుగుపర్చే లక్ష్యంతో సీఎం జగన్ మరో విప్లవాత్మక కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. నిత్యం గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని ఓ కంట కనిపెడుతూ వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అవగాహన ఉండే ఫ్యామిలీ డాక్టర్‌ తరహా వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ‘ఆస్పత్రుల్లో నాడు- నేడు’పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి మండలంలో కనీసం 2 పీహెచ్‌ సీ లు ఉండాలని, ప్రతి పీహెచ్ ‌సీ లో కనీసం ఇద్దరు చొప్పున.. మొత్తం నలుగురు డాక్టర్లు ఉండాలని, ప్రతి డాక్టర్‌ కు కొన్ని గ్రామాలను కేటాయించాలని చెప్పారు. ఆ డాక్డర్‌ ప్రతి నెల కనీసం రెండు సార్లు తనకు నిర్దేశించిన గ్రామాలకు వెళ్లి వైద్యం అందించాలని, తద్వారా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితుల మీద అతనికి అవగాహన ఏర్పడుతుందన్నారు.

వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశావర్కర్లు డాక్టర్ ‌తో ఉంటారని, 104 వాహనాల ద్వారా వారికి చికిత్స అందించడం సులభం అవుతుందని వివరించారు. అలాగే నిరంతరం హోం విజిట్స్‌ కూడా చేయాలని, అవసరం అనుకుంటే 104లను కూడా పెంచుకోవాలని సూచించారు. డాక్టర్లు సేవలు అందించడానికి విలేజ్‌ క్లినిక్‌ కూడా వేదికగా ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. కొంతకాలానికి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులపై సంబంధిత డాక్టర్‌కు పూర్తి అవగాహన ఏర్పడుతుందన్నారు. దీంతో గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ వస్తుందని, వైద్యం చేయడం కూడా సులభమవుతుందని చెప్పారు. అలాగే 2021 డిసెంబర్ నాటికి పలాస సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు, 2023 జూన్‌ నాటికి కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు తెలిపారు. ఐటీడీఏల పరిధిలోని 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించే దిశగా ప్రయత్నిస్తున్నామని వివరించారు

అలాగే వైఎస్సార్‌ అర్బన్ హెల్త్ క్లినిక్‌ ల పనులు జనవరి నెలాఖరుకు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. పీహెచ్ ‌సీల్లో నాడు-నేడు పనులు 2021 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 2021 డిసెంబర్ కల్లా ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఇదే సమయంలో కరోనా మళ్లీ పంజా విసరడంతో బ్రిటన్‌ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలను విధించారని.. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. సూపర్‌ స్పెషాల్టీ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న సదుపాయాలపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో ఉన్న సదుపాయాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని, వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం, సిబ్బంది ప్రభుత్వానికి ఉన్నారని అధికారులు వెల్లడించారు
Tags:    

Similar News