క‌స్ట‌మ‌ర్‌ కేసు వేస్తే...ప్లిప్‌ కార్ట్ ఫైన్ క‌ట్టింది

Update: 2017-03-28 12:01 GMT
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌ సైట్ ఫ్లిప్‌ కార్ట్ కు ఫైన్ పడింది. ఫైన్ అంటే ఎన్నో కోట్లు - లక్షల రూపాయలు కాదు లెండి. కేవలం రూ.15వేలు - అంతే..! ఓ వినియోగదారుడికి నాసిరకం ఫోన్ చార్జర్‌ ను అమ్మినందుకు గాను అతనికి ఫ్లిప్‌ కార్ట్ ఆ మొత్తం జరిమానాను చెల్లించనుంది. ఈ మేరకు వినియోగదారుల ఫోరం ఫ్లిప్‌ కార్ట్‌ కు ఆదేశాలు జారీ చేసింది. సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే...

హైదరాబాద్‌ కు చెందిన డాక్టర్ అహ్మద్ అక్ ఇర్ఫానీ ఈ ఏడాది జనవరిలో ఫ్లిప్‌ కార్ట్ సైట్‌ లో ఓ స్మార్ట్‌ ఫోన్ చార్జర్‌ ను కొనుగోలు చేశాడు. దాని ధర రూ.259. అయితే ఆ చార్జర్‌ తో ఫోన్‌ కు చార్జింగ్ పెట్టగానే ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. ఈ క్రమంలో ఫోన్ లోపలి భాగం మొత్తం షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయింది. దీంతో ఫోన్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. అయితే ఈ విషయంపై ఇర్ఫానీ ఫ్లిప్‌ కార్ట్‌ కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫ్లిప్‌ కార్ట్ ఆ ఫిర్యాదుకు స్పందించి కావాలంటే చార్జర్‌ ను మారుస్తామని, కానీ ఫోన్ కాలిపోయినందుకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఆ సమాధానం విన్న ఇర్ఫానీకి ఒళ్లు మండిపోయింది. వెంటనే ఈ విషయంపై వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.

వినియోగదారుల ఫోరంలో ఫ్లిప్‌ కార్ట్ ప్రతినిధులు ఏమని వాదించారంటే.. తాము అమ్మేవారికి - కొనేవారికి నడుమ మధ్య వర్తిత్వం మాత్రమే చేస్తామని, సాధారణంగా తమ వెబ్‌ సైట్‌ లో విక్రయించే వస్తువులన్నీ నాణ్యమైనవే ఉంటాయని అన్నారు. అయినప్పటికీ ఫోరం ఫ్లిప్‌ కార్ట్ వాదనతో సంతృప్తి చెందలేదు. బాధితుడికి కొత్త చార్జర్ ఇవ్వడంతోపాటు అతని ఫోన్‌ కు విలువైన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఫ్లిప్‌ కార్ట్ ఇర్ఫానీకి అతని ఫోన్ ఖరీదు రూ.15వేలను ఫైన్‌ గా చెల్లించింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News