దుమ్ము రేపిన హైదరాబాద్.. తొలిసారి నెంబర్ వన్ ప్లేస్ లోకి

Update: 2020-01-08 04:09 GMT
తిరుగులేని రీతిలో దూసుకెళుతోంది  హైదరాబాద్ అన్న మాటలో నిజం ఎంతన్నది తాజా నివేదిక స్పష్టం చేస్తుందని చెప్పాలి. ఆఫీస్ లీజు విషయంలో దేశంలోని నగరాల్లో హైదరాబాద్ నెంబర్ వన్ గా నిలిచింది. తొలిసారి ఆగ్రస్థానానికి ఎదిగిన ఈ వైనాన్ని నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. గత ఏడాదిలో దేశంలోని ప్రముఖ నగరాల్లో ఆఫీస్ స్పేస్ కు సంబంధించిన లీజ్ డీల్స్ కు సంబంధించిన ర్యాంకింగ్ లెక్కల్ని చూస్తే.. హైదరాబాద్ ఎంతలా ముందుకెళుతుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

గత ఏడాది సెకండాఫ్ లో అంటే.. జులై-డిసెంబరు మధ్య కాలం లో 89 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లో కొత్త కార్యాలయాలు  హైదరాబాద్ లో ఏర్పాటైనట్లు సదరు నివేదిక పేర్కొంది. ఏడాది మొత్తాన్ని యూనిట్ గా తీసుకుంటే బెంగళూరు మహానగరం ముందు ఉన్నప్పటికీ.. గత ఏడాది సెకంఢాఫ్ ను పరిగణలోకి తీసుకుంటే మాత్రం హైదరాబాద్ కు తిరుగు లేని రీతిలో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఏడాది మొత్తాన్ని లెక్కలోకి తీసుకుంటే 1.53 కోట్ల చదరపు అడుగులతో బెంగళూరు తొలి స్థానంలో ఉంటే.. హైదరాబాద్ మాత్రం 1.28 కోట్ల చదరపు అడుగుల తో రెండో సథానంలో నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే... 2018తో పోలిస్తే రెండింతలు ఎక్కువగా లీజ్ డీల్స్ జరిగాయి. గత ఏడాది దేశం మొత్తంలోనూ లీజ్ డీల్స్ భారీగా జరిగినట్లు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాలు అన్నింటితో కలిపి 6.06 కోట్ల చదరపు అడుగుల మేర జరిగింది. ఇది 2018తో పోలిస్తే 27 శాతం పెరగటం గమనార్హం.

లీజు విషయం ఇలా ఉంటే.. హైదరాబాద్ లో ఇళ్ల ధరలు దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువగా పెరిగిన వైనాన్ని పేర్కొంది. దేశంలోని ఇతర నగరాల్లోని ఇళ్ల ధరలతో పోలిస్తే.. హైదరాబాద్ లో మాత్రం 10 శాతం మేర పెరిగాయట. బెంగళూరులో 6.3 శాతం.. ఢిల్లీలో 4.5శాతం.. కోల్ కతాలో 3.1 శాతం.. అహ్మదాబాద్ లో 2 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. హైదరాబాద్ లో ఫ్లాట్ సగటు చదరపు అడుగు ధర రూ.4500 ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. హైదరాబాద్ లో రూ.80లక్షల నుంచి రూ.కోటి మధ్యలో ఉన్న ఇళ్లకు డిమాండ్ అధికంగా కనిపించిందని నివేదిక స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే.. దేశంలోని మిగిలిన అన్ని ప్రధాన నగరాల కంటే హైదరాబాద్ ముందంజలో ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News