ఫోర్బ్స్ జాబితాలో 22 ఏళ్ల హైదరాబాదీకి చోటు.. ఎందుకంటే?

Update: 2022-05-27 17:30 GMT
అంతర్జాతీయ వేదికల మీద మనోళ్లు మెరిసిపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు చొప్పున తమ టాలెంట్ ను చూపించటం ద్వారా అందరి మనసుల్ని గెలుచుకుంటున్నారు. మొన్నటికి మొన్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ ను సొంతం చేసుకున్న హైదరాబాదీ అమ్మాయి విజయం ఆనందానికి గురి చేస్తే.. తాజాగా హైదరాబాద్ కు చెందిన 22 ఏళ్ల కుర్రాడు మరో ఘనతను సాధించాడు.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లోని ప్రముఖుల్ని గుర్తించే ఫోర్బ్స్ మీడియా సంస్థ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. అందులో 22 ఏళ్ల హైదరాబాదీ జొన్నలగడ్డ  నీలకంఠ భాను ప్రకాశ్ కు చోటు దక్కింది.

మీడియాలో పెద్దగా ఫోకస్ కాని ఈ కుర్రాడు ఏం చేశాడు? ఏం సాధించాడు? ఫోర్బ్స్ జాబితాలో చోటు ఎలా దక్కించుకున్నాడన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

గణిత మేధావిగా సుపరిచితుడైన భానుప్రకాశ్ తన పదిహేడేళ్ల వయసులోనే ప్రపంచంలోనే వేగవంతమైన మానవ క్యాలిక్యులేటర్ గా పేరును సొంతం చేసుకున్నాడు. నాలుగు ప్రపంచ రికార్డులు.. యాభై లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ను తిరగరాసిన అతను 2020లో ‘‘భాన్జు’’ అనే కమర్షియల్ ఎడ్ టెక్ అంకురాన్ని ప్రారంభించారు.

మ్యాథ్స్ పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భయాన్ని పోగొట్టే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. భాన్జు పద్దతిలో లెక్కల్ని అభ్యసిస్తే.. వేగంగా.. మెరుగ్గా లెక్కల్ని చేసే అవకాశం ఉందన్నది అతని వాదన. ఈ కారణంతోనే అతను భాన్జును షురూ చేశారు.

2021 జులైలో అతను స్థాపించిన సంస్థకు లైట్ స్పీడ్ వెంచర్స్ నుంచి 2 మిలియన్ డాలర్ల సీడ్ ఫండింగ్ అందింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది మందిపై ప్రభావాన్ని చూపటమే కాదు.. సానుకూల ఫలితాలు వచ్చాయి. అతని సంస్థ ఎదుగుతున్న వైనాన్ని ప్రతగా తాజా గుర్తింపు లభించినట్లు చెబుతున్నారు. 30 అండర్ 30 ఏషియా క్లాస్ ఆఫ్ 2022 జాబితాలో మనోడి పేరును చేర్చారు.
Tags:    

Similar News