ఫోర్జరీ కేసులో అడ్డంగా బుక్కైన మాజీ మంత్రి....

Update: 2019-08-28 10:49 GMT
అధికారం కోల్పోయిన దగ్గర నుంచి టీడీపీ నేతలు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడిన మాజీ స్పీకర్ కోడెల్ శివప్రసాద్ - ఆయన కుటుంబంపై చాలానే కేసులు నమోదైన విషయం తెలిసిందే. అటు అక్రమ మైనింగ్ కేసులో టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ విచారణకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఓ భూమి విషయంలో ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో పామర్రు పిచ్చిరెడ్డికి సర్వే నెంబర్లు 581 - 583 మొత్తం 13.71ఎకరాల భూమి ఉంది. అయితే ఇందులో 10.94 ఎకరాలకు పంపకాలు సరిగా జరగలేదనే వివాదం ఉంది. ఇక ఈ వివాదం అప్పుడు మంత్రిగా ఉన్న సోమిరెడ్డి దృష్టికి వెళ్లింది. అయితే సర్వే నంబరు 583 ప్రకారం ఉన్న 2.36 ఎకరాల భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి తన పేరుతో రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత భూమిని చెన్నై నగరానికి చెందిన మేఘనాథన్ - ఏఎం జయంతిలకు అమ్మేశారు.

ఇక దీనిపై బాధితుడు అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే తాజాగా ఈ బాధితుడి పిటిషన్ ని విచారించిన న్యాయస్థానం సోమిరెడ్డితోపాటు వీఆర్‌ మేఘనాథన్ - ఏఎం జయంతి - సర్వేయర్‌ సుబ్బరాయుడులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు వారిపై 471 - 468 - 447 - 427 - 397 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు వ్యవహారంపై సోమిరెడ్డి స్పందించలేదు. ఆయన లాయర్లతో చర్చించి న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News