మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత అరెస్టు!

Update: 2022-09-14 08:38 GMT
బ్యాంకును మోసం చేసి రుణం తీసుకున్న కేసులో వైఎస్సార్సీపీ అర‌కు లోయ‌ మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆమెను హైద‌రాబాద్‌లో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు బెంగ‌ళూరుకు విచార‌ణ నిమిత్తం త‌ర‌లించారు. బ్యాంకును మోసం చేసి రుణం తీసుకున్న కేసులో గీత దంపతులపై చాలాక్రితమే సీబీఐ కేసు నమోదు చేసి.. ఛార్జ్‌షీట్ సైతం ఫైల్ చేసిన సంగ‌తి తెలిసిందే.

కొత్త‌ప‌ల్లి గీత పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 52 కోట్ల రూపాయల రుణం తీసుకుని.. తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేర‌కు గీతపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేరుతో గీత దంప‌తులు పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు.

రుణం చెల్లించ‌క‌పోవ‌డంతో బ్యాంకు అధికారుల ఫిర్యాదు చేశారు. దీంతో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ అధికారులు 2015 జూలై 11న చార్జీషీట్ దాఖలు చేశారు. కొత్తపల్లి గీత, ఆమె భర్త విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి. రామకోటేశ్వరరావుల‌ను సీబీఐ అధికారులు నిందితులుగా చేర్చారు.

అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు అప్పటి బ్రాంచ్ మేనేజర్ బీకే జయ ప్రకాశం, అప్పటి జనరల్ మేనేజర్ కేకే అరవిందాక్షన్ తదితరులను సీబీఐ చార్జీషీట్ల్ చేర్చింది.  బ్యాంకు నుండి రుణం పొందేందుకు  నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ త‌న‌  చార్జిషీట్ లో పేర్కొంది. వాస్తవాలను దాచిపెట్టి బ్యాంకును మోసం చేశార‌ని వివ‌రించింది.

బ్యాంకుకు తప్పుడు సమాచారం ఇచ్చి భారీ మొత్తంలో రుణం పొందార‌ని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గీతను అరెస్ట్ చేసిన సీబీఐ.. విచారణ నిమిత్తం బెంగళూరుకు తరలించింది.

కాగా కొత్త‌ప‌ల్లి గీత 2014లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అర‌కు లోయ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ త‌ర్వాత అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి ద‌గ్గ‌ర‌య్యారు. 2018లో జ‌న జాగృతి పేరుతో పార్టీ కూడా ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత 2019లో బీజేపీలో చేరారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News