సీనియర్ నేత చేత బూట్లు పట్టించిన యువరాజు

Update: 2015-12-09 09:40 GMT
రాహుల్ గాంధీని కాంగ్రెస్ యువరాజుగా అభివర్ణిస్తే చాలామంది కాంగ్రెస్ నేతలకు కోపం వచ్చేస్తుంది. తమ నాయకుడిపై అంతలా వ్యంగ్యవ్యాఖ్యలు చేస్తారే అంటూ విరుచుకుపడతారు. వ్యక్తిపూజ విషయంలో కాంగ్రెస్ కు మించిన పార్టీ మరొకటి లేదన్న మాటకు తగ్గట్లే.. ఇప్పటికే చాలానే ఉదంతాలు చోటు చేసుకున్నాయి.

గాంధీ ఫ్యామిలీలో నేతల తీరు ఎలా ఉంటుందనటానికి రాహుల్ తాజా వ్యవహరశైలి చూస్తే తెలుస్తుంది. చూసేందుకు అమూల్ బేబీలా క్యూట్ గా ఉండే.. రాహుల్ నరనరాల్లోనూ రాజరిక పోకడలు కనిపిస్తుంటాయి. తాజాగా తన తమిళనాడు పర్యటన సందర్భంగా తన బూట్లను.. పార్టీ సీనియర్ నేత.. మాజీ కేంద్రమంత్రి నారాయణస్వామి చేతికి ఇచ్చారు. అంత పెద్ద యువరాజు వేసుకున్న చెప్పులు మోసే అవకాశం వచ్చిందన్న సంతోషంతో కాబోలు.. ఆయన కూడా ఏ మాత్రం మొహమాట పడకుండా.. వాటిని అందుకొని.. రాహుల్ వెంట నడిచారు.

తమిళనాడు.. పుదుచ్చేరిలలో చోటు చేసుకున్న భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న ప్రాంతాల్ని సందర్శించి.. బాధితులకు సాంత్వన పలికే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై విమర్శలు రావటంతో.. వరదనీళ్లల్లో బూట్లతో నడిచే ఇబ్బందన్న ఉద్దేశ్యంతో తనకు మర్యాదపూర్వకంగా రాహుల్ బూట్లు ఇచ్చారని.. అందుకే తాను పట్టుకున్నట్లుగా సదరు మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. నారాయణస్వామి వైఖరి చూస్తుంటే.. యువరాజుల వారు వేసుకున్న బూట్లను పట్టుకోవటం తన జన్మజన్మల పుణ్యఫలంగా అభివర్ణించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదేమో.
Tags:    

Similar News