తెలుగురాష్ట్రాల జల జగడానికి ఫుల్ స్టాప్...గెజిట్‌‌‌ విడుదల, స్వాగతించిన ఏపీ , తెలంగాణ తీవ్ర ఆగ్రహం !

Update: 2021-07-16 10:30 GMT
ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య బిగుసుకుంటున్న జల వివాదంపై దృష్టి సారించిన కేంద్రం.. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేస్తూ గెజిట్లు విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదానికి చరమగీతం పాడుతూ ఒక్కో రాష్ట్రానికి నీటి వాటా ఎంత, వినియోగించాల్సింది ఎంత అనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది. కేంద్రం రెండు రాష్ట్రాల్లో విస్తరించిన కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్వాహణను బోర్డులకు అప్పగించింది. రెండు బేసిన్‌ లోని ప్రాజెక్టులను బోర్డుల పర్యవేక్షణ కిందికి తీసుకువచ్చింది.

అక్టోబర్ 14 నుంచి ఈ గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానుంది. గతేడాది అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ మినిట్స్‌ ప్రకారం బోర్డు పరిధికి సంబంధించిన అంశాలను నిర్ధారించారు. కృష్ణా ట్రైబ్యునల్‌ -2 ప్రకారం ప్రాజెక్టులవారీ కేటాయింపులు ఇంకా ఖరారు కానందున, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు మేరకే కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేస్తారు.. కృష్ణా ట్రైబ్యునల్‌-2 తీర్పు వచ్చాక దాని ప్రకారం సవరణలు జరుగుతాయని వెల్లడించారు.

పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టులకు బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులు లేనందున, ప్రస్తుత ట్రైబ్యునల్‌ ప్రకారం కేటాయింపులకు రెండు రాష్ట్రాలు ప్రయత్నించాలి. తర్వాత ఈ ప్రాజెక్టుల నిర్వహణ కూడా బోర్డు చూస్తుంది.  

గోదావరి బోర్డుకు సంబంధించి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ బోర్డు పరిధిలోకి చేరాయి. నిర్మాణంలో ఉన్నవి, కొత్తవి, భవిష్యత్తులో రెండు రాష్ట్రాలు చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి పొందిన తర్వాత గెజిట్‌ లో చేర్చుతుంది. 2018 ఫిబ్రవరి, 2020 జనవరిలో రెండు రాష్ట్రాలతో దీనిపై కేంద్రం చర్చించినట్లు కూడా నోటిఫికేషన్‌ లో కేంద్రం వెల్లడించింది.

ఈ గెజిట్ ఫలితంగా బోర్డుల పరిధిలోకి కృష్ణానదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు వస్తాయి. అనుమతి లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోగా అనుమతులు తెచ్చుకోవాలి. అనుమతులు రాకపోతే ప్రాజెక్టులు నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్‌ 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్లు అమల్లోకి రానున్నాయి. ఇక, ఒక్కో రాష్ట్రం బోర్డుకు 200 కోట్ల రూపాయల చొప్పున డిపాజిట్‌ చేయాలి. సీడ్‌ మనీ కింద ఈ మొత్తాన్ని 60 రోజుల్లో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల్లో చెల్లించాలని కేంద్రం సూచించింది.

ఇక ఇదిలా ఉంటే .. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, న్యాయం తమ పక్కనే ఉందని, విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయించి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పూర్తయ్యేది కాదు అని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను అడ్డగోలుగా వదిలేశారని, తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలకు గండి కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ దూకుడుగా ఉన్నా సంయమనం పాటించామన్నారు. సీఎం జగన్ రాజ్యాంగబద్ధంగా ఒత్తిడితెచ్చి విజయం సాధించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

గెజిట్‌ తో చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలు ఉండవన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులెవరూ ఇబ్బంది పడకూడదని. సానుకూలంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు.  ఇక ,కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ పై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ అంశంపై ప్రధానితో చర్చించడానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అంతేకాదు, దీనిపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. జల వివాదాలపై సీఎం కేసీఆర్‌ నేడు సమీక్ష నిర్వహించనున్నారు. నీళ్ల లెక్క తేలాకే విధివిధానాలు ప్రకటించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది.
Tags:    

Similar News