భారతీయ జనతా పార్టీ.. బోల్తా పడితే మొదటికే మోసం!

Update: 2019-11-24 10:13 GMT
అందులో మొదటి అంశం.. మెజారిటీ లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం. గోవా వంటి చిన్న రాష్ట్రంలో అలాంటి పని చేస్తే ఎవరూ పెద్దగా గుర్తించలేదు. మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రంలో, బహుముఖ రాజకీయానికి చోటున్న రాష్ట్రంలో అలాంటి పని తీవ్ర విమర్శలకు దారి తీయడం ఖాయం.

ఇక రెండో అంశం.. ఎన్సీపీ చీలిక వర్గంతో అయినా జత కట్టడం. ఎన్సీపీని భారతీయ జనతా పార్టీ ఎంతగా విమర్శించిందో చెప్పనక్కర్లేదు. అందులోనూ ఇప్పుడు బీజేపీ వాళ్లు ఉపముఖ్యమంత్రిగా నియమించిన అజిత్ పవార్ కు ఇటీవలే సీబీఐ,ఈడీల నోటీసులు అందాయి. ఆయనను విచారణకు పిలుస్తారనే ప్రచారం సాగింది. ఆయన అవినీతి పరుడు అంటూ బీజేపీ ఎన్నో వందల సార్లు విమర్శించి ఉంటుంది. ఇప్పుడు ఆయనకే బీజేపీ ఉపముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది.

ఇలాంటి తీరుతో భారతీయ జనతా పార్టీ తటస్థుల దృష్టిలో చాలా దిగజారిపోతుంది. భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం రాజకీయ విలువలు లేవని తటస్థులు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

విశ్వాస పరీక్షను ఎదుర్కొని ఎలాగోలా విజయం సాధించినా.. ఆ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఒకవేళ విశ్వాస పరీక్షలోనే భారతీయ జనతా పార్టీ గనుక బోల్తా పడితే అంతే సంగతులు! గవర్నర్ పాత్ర భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉందనే విమర్శలూ తప్పడం లేదు. తెల్లవారుజామున, కేబినెట్ నుంచి ఎలాంటి సలహా లేకపోయినా.. ఉన్నట్టుండి రాష్ట్రపతి పాలన ఎత్తేయడం ఏమిటని న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రపతి పాలన అనేది గవర్నర్ ఇష్టానుసారం పెట్టేది, తీసేసేది కాదు. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర దానికి ఉండాలి. ఇలా ఎలా చూసినా.. భారతీయ జనతా పార్టీ రాజకీయం తీవ్ర విమర్శల పాలవుతూనే ఉంది.ఇలాంటి క్రమంలో విశ్వాస పరీక్షలో గనుక బీజేపీ సత్తా చూపించుకోలేకపోతే.. ఆ పార్టీ బోల్తా పడినట్టే. బీజేపీ ప్రభుత్వం నిలబడబకపోతే.. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల ప్రభుత్వానికి పూర్తిగా లైన్ క్లియర్ అయినట్టే!  అప్పుడు కమలం పార్టీ మరింత ఇరకాటంలో పడటం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News