బాబును చెప్పుతో కొట్టాలని ఎందుకు అన్నాడంటే

Update: 2016-06-03 11:43 GMT
“ గుడినీ - గుళ్ళో లింగాన్నీ మింగేసే అవినీతిపరుడు చంద్రబాబు.. పెద్దలు - పిల్లలు అందరిచేతా ఎక్కడ పడితే అక్కడ నవనిర్మాణ దీక్షలు చేయిస్తున్నారు చంద్రబాబు.. ఆయన దీక్షల్లో ఉన్న అంశాలు నిజమవ్వాలీ అంటే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసి చెప్పులతో కొట్టాలి.. అప్పుడే ఈ అరాచకం - అవినీతి ఆగుతాయి” అనంతపురం జిల్లాలో వైసీపీ అధినేత‌ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి.

నవనిర్మాణ దీక్షలు చేయిస్తున్న చంద్రబాబునాయుడుని ప్రజలు చెప్పులతో కొట్టాలంటూ జగన్ అనడం వివాదానికి దారితీసింది. జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకగణం - కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ఏపీలోని అనేక పట్టణాల్లో ర్యాలీలు తీశారు. జగన్ క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. జగన్ ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టారు. క్రిమినల్ జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ కు మతి భ్రమించిందని, ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నరని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడింది అసలు భాషేనా అని మ‌రో మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు.

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వర్ల రామయ్య అయితే జగన్ పై నిప్పులు చెరిగారు . “ఆంబోతు రెచ్చిపోయి ప్రవర్తిస్తుంటే ఏం చేస్తాం.. నాలుగు గోడల మధ్య కట్టేసి బయట తిరక్కుండా చేస్తాం.. జగన్నూ అంతే.. ఆయనకు సభ్య సమాజంలో తిరిగే హక్కు లేదు. కేసులు రుజువైతే ఆయన చంచల్ గూడ జైలులో ఉంటారు లేదా తీహార్ లో ఉంటారు. దొంగల ముఠా నాయకుడైన జగన్ కు చదువులేదు  సంధ్య లేదు, సంస్కారం లేదు. భాష రాదు.. సంఘ విద్రోహుల కూటమికి నేత అయిన ఆయనకు తల్లి, భార్య అయినా సంస్కారం నేర్పాలి.. ఒళ్ళు జాగ్రత్త.. తరువాత జరిగే పరిణామాలకు జగనే బాధ్యత వహించాలి” అని వర్ల రామయ్య విరుచుకుపడ్డారు.

అయితే వైసీపీకి చెందిన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకుంటూ వ‌చ్చారు. ప్రజా క్షేమం మరిచి దీక్షలు మాత్రమే చేయిస్తే ప్రజలు చెప్పుతో కొడతారన్నది మాత్రమే జగన్ అభిప్రాయమని,  చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేయలేదన్నారు. దీన్ని మీడియా వక్రీకరికస్తోందని సర్దిచెప్పారు.
Tags:    

Similar News