త‌మ్ముళ్లు కూడా బైబై బాబు అనేందుకు రెఢీనా?

Update: 2019-05-03 09:18 GMT
ఏపీలో ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల పోలింగ్ లో ఏపీ అధికార‌ప‌క్షానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ఓట్లు ప‌డిన‌ట్లుగా ప‌లు అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బాబు ఓట‌మి ఖాయ‌మ‌ని.. జ‌గ‌న్ గెలుపు ప‌క్కా అన్న విశ్లేష‌ణ‌లు ప‌లువురి నోట వినిపిస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బైబై బాబు అంటూ జ‌గ‌న్ ఇచ్చిన పిలుపున‌కు ఏపీ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ బాగుంద‌ని.. ఆయ‌న కోరిన‌ట్లే బాబుకు బైబై చెప్పేసిన‌ట్లుగా ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గ‌డికోట్ శ్రీ‌కాంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల్లో ఓట‌మికి సిద్ధ‌మ‌వుతున్న టీడీపీ నేత‌లు.. త‌మ ఓట‌మికి ఈవీఎంల‌ను బూచిగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు. ఏపీలో త్వ‌ర‌లో జ‌రిగే స్థానిక ఎన్నిక‌ల నాటికి టీడీపీ రాష్ట్రంలో ఉండ‌ద‌న్న భ‌యాందోళ‌న‌లు తెలుగు త‌మ్ముళ్ల‌లో నెల‌కొంద‌న్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు న‌మ్మ‌కం స‌డ‌లింద‌న్న ఆయ‌న‌.. టీడీపీలోని ఒక వ‌ర్గం అధినేత‌కు బైబై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు చెప్పారు. రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు అన‌ర్హుడిగా వ్యాఖ్యానించిన గ‌డికోట‌.. ఏపీ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌స్థ‌ల్ని దిగ‌జార్చార‌న్నారు.

ఎన్నిక‌ల‌కు ముందు ఈవీఎంలు వ‌ద్ద‌ని చెప్ప‌ని బాబు.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్య‌లు చేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఏపీ డీజీపీ ఠాకూర్ మీద ప‌లు ఫిర్యాదు చేసినా.. ఆయ‌న్ను బ‌దిలీ చేయ‌లేద‌ని వ్యాఖ్యానించారు. వెన్నుపోటు రాజ‌కీయాలు బాబుకు బాగా తెలుస‌న్న శ్రీ‌కాంత్ రెడ్డి.. ప‌వ‌ర్లో ఉన్న బాబు చేయ‌కూడ‌ని ఎన్నో ప‌నులు చేశార‌న్నారు. మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. తెలుగు త‌మ్ముళ్ల‌లో కొంత‌మంది బైబై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న శ్రీ‌కాంత్ వ్యాఖ్య‌లు ఇప్పుడు కొత్త క‌ల‌క‌లాన్ని రేప‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News