ఏపీ సీఎం చంద్రబాబు ఏం మాట్లాడినా విషయం ఉండకుండా ఉండదు. అది అర్థసత్యమైనా.. అసత్యమైనా.. దానికి మసి పూసి మారేడు కాయ చేయడంలో బాబును మించిన అపర చాణక్యుడు లేదని అంటారు టీడీపీ నేతలే. బిల్ గేట్స్ కు తానే కంప్యూటర్ నేర్పించానంటారు. దేశంలో సామాజిక పింఛన్లను తెచ్చింది తానే నంటారు. వినేవాడు ఉండాలే కానీ - కుందేలుకు పరుగు - కుక్కకు మొరుగు కూడా నేర్పింది తానేనని మార్కులేసుకుంటారు. ఇలాంటి వింత కామెంట్లతోనే అందరిలోనూ చీఫ్ మినిస్టర్ కాస్తా.. చీప్ మినిస్టర్ అయిపోతున్నారని దుయ్యబడుతున్నారు వైసీపీ సీనియర్ నేత - ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.
విషయంలోకి వెళ్తే.. రెండు రోజుల కిందట టీడీపీ తమ్ముళ్లకు నిర్వహించిన వర్క్ షాపులో చంద్రబాబు ఓ మాట తూలారు. తాము గత ఎన్నికల సమయంలో టీడీపీ మ్యానిఫెస్టోను రాష్ట్ర విభజనకు ముందే వెలువరించామని చెప్పారు. అంటే, ఆయన తన హామీల విషయంలో ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశంతో ఈ కామెంట్లు చేశారు. అయితే, ఇక్కడే సరిగ్గా తప్పులో కాలేశారు చంద్రబాబు. అప్పటి ఎన్నికల సమయంలో మార్చి 31న టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అయితే, మార్చి 1న రాష్ట్ర విభజన జరిగినట్లు గెజిట్ విడుదలైంది. దీంతో చంద్రబాబు వ్యాఖ్యల్లోని డొల్లతనం బయటపడిందని గడికోట విమర్శించారు.
అంతేకాదు, బాబు చేసిన ఈ వ్యాఖ్యలు జోక్ ఆఫ్ ది ఇయర్ గా చెప్పొచ్చని ఎద్దేవా చేశారు. మీడియాతో మాట్లాడిన గడికోట బాబు - ఆయన పార్టీపై విరుచుకుపడ్డారు. హామీలు అమలు చేస్తామని ఎన్నికల కమిషన్ కు కూడా ఏప్రిల్ లో లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో మేనిఫెస్టో ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటు. సీఎం స్థాయి వ్యక్తి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటని ప్రశ్నిస్తే ఎదురు దాడులు చేస్తున్నారు. ప్రజలను మోసపుచ్చడం సరైనదేనా? పదవీ వ్యామోహంతో చంద్రబాబు ఇతరులపై బురద జల్లుతున్నారు. కులాలు - మతాల మధ్య చిచ్చు పెడుతున్నది చంద్రబాబే. పైగా ప్రతిపక్ష నేతపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అన్ని కులాలను చంద్రబాబు మోసం చేశారు అని అన్నారు.
చంద్రబాబు.. తాను చేయలేనిది కూడా చేస్తున్నట్టు చెబుతూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని, నంద్యాలలో ప్రజలను భయపెట్టారని ఆయన అన్నారు. అయితే, దీనినే బాబు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నిజానికి అధికార పార్టీ మంత్రులు - ఎమ్మెల్యేలు - గడపగడపకు వెళ్లి.. ప్రజలను భయ భ్రాంతులకు గురిచేశారని, ఓటేయకపోతే పింఛన్ కట్ - నీళ్లు కట్ అంటూ బరితెగించి ఓట్లేయించుకున్నారని విమర్శించారు. ఇంత చేసినా.. ఒక్క చంద్రబాబు మాత్రమే నంద్యాలను చూసుకుని పైశాచిక ఆనందం పొందుతున్నారని, మిగిలిన టీడీపీ నేతలు ఒక్కరిలోనూ ఆ ఆనందం కనిపించడం లేదని అన్నారు.