ఏపీకి శాశ్విత సీఎం జగన్.. తేల్చేసిన వీర విధేయుడు

Update: 2022-03-20 09:30 GMT
అభిమానం తప్పేం కాదు. దానికో పరిమితి ఉంటుంది. అంతేకానీ అభిమానం పేరుతో అహంకారపూరితంగా మాట్లాడం వల్ల నష్టం జరుగుతుందన్నది మర్చిపోకూడదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా అభిమానించేవారు.. ఆరాధించే వారికి కొదవ లేదు.

నిజానికి ఆయనకు రాజకీయ ప్రత్యర్థుల కంటే కూడా ఆయనకు వీర విదేయులుగా ఉండేవారితోనే అసలు సమస్యంతా. ఎందుకంటే.. ఆయన ఇమేజ్ ను తప్పుగా ప్రొజెక్టు చేయటంలో వారు ముందుంటారు. అందుకు సాక్ష్యంగా తాజాగా ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే.

ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన సందర్భంగా వైసీపీ వ్యతిరేకత ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీల్చకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. దీంతో.. జనసేన - టీడీపీ మధ్య పొత్తు లెక్కలకు అనధికారికంగా తెర తీసిన పరిస్థితి. ఎన్నికల నాటికి కచ్ఛితంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమన్న మాట వినిపిస్తోంది. పవన్ వ్యాఖ్యల అనంతరం ఏపీ అధికార పక్షానికి చెందిన నేతలు చేస్తున్న విమర్శలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి.

ఏపీ అధికార పక్షానికి చెందిన నేత ఒకరు సవాలు విసిరుతూ.. ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో నిలబడినా ఆయన్ను తప్పనిసరిగా ఓడిస్తానని చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సీఎం జగన్ కు వీర విధేయుడిగాపేరు పడిన చీప్ విప్ గడికోటశ్రీకాంతరెడ్డి మాట్లాడుతూ.. మరో అడుగు ముందుకు వేసేశారు. సీఎం జగన్ మీద తనకున్న అభిమానాన్ని మాట్లలో చెప్పేశారు.

వెనుకా ముందు చూసుకోకుండా రెట్టించిన ఉత్సాహంతో చేసిన వ్యాఖ్యలు పార్టీకి.. మరి ముఖ్యంగా జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే.. ఏపీకి జగన్మోహన్ రెడ్డి శాశ్వితముఖ్యమంత్రిగా ఆయన తేల్చేశారు.

జగన్ పాలనను అభిమానించే వారు సైతం.. ఈ తరహా వ్యాఖ్యలో అభిమానం కంటే కూడా అహంకారమే ఎక్కువగా కనిపిస్తోందని.. దీని వల్ల మేలు కంటే చేటే ఎక్కువగా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఇలాంటి వ్యాఖ్యలు  సీఎం జగన్ ఇమేజ్ కు స్పీడ్ బ్రేకర్లుగా పని చేస్తాయన్న మాట వినిపిస్తోంది. సీఎం జగన్.. ఈ మాటల్నివింటున్నారా?
Tags:    

Similar News