ఇంకా వైసీపీపై అడ్డగోలు ఏడుపులే!?!

Update: 2018-02-12 10:23 GMT
తెలుగుదేశానికి చెందిన లోక్ సభ ఎంపీ గల్లా జయదేవ్ గుంటూరుకు వచ్చారు.  తమాషా ఏంటంటే.. అక్కడికేదో తమ నాయకుడు యుద్ధంలో విజయం సాధించి సమరోత్సాహంతో తిరిగివస్తున్నట్లుగా తెలుగుదేశం శ్రేణులు ఆయనకు సత్కారం ఏర్పాటు చేసేశాయి. వేదిక మీద ఆయన చేతికి ఓ  కత్తి అందిస్తే.. ఆయన దానిని పైకెత్తి చూపి భాజపాకు ఓ హెచ్చరిక పంపేశారు. కేవలం నాలుగేళ్లలో ఒక్కసారి లోక్ సభలో మాట్లాడినందుకే ఇంత నానా హడావిడి చేస్తే.. దీనికి ముందు నాలుగేళ్లపాటూ మౌనంగా ఉన్నందుకు పరిస్థితి ఏంటో అనుకునే వారు కొందరున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటికీ పార్లమెంటులో వైఎస్సార్ కాంగ్రెస్ సరిగ్గా పోరాడలేదని అంటూ.. అక్కడికేదో తాము ఒక్కరమే పోరాడినట్లుగా బిల్డప్ ఇచ్చుకోవడనికి ఎంపీ జయదేవ్ పడుతున్న పాట్లను చూసి జనం నవ్వుకుంటున్నారు.

నాలుగురోజుల పోరాటాల్లో కీలకమైన ఘట్టంలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతున్న సమయంలో.. తెదేపా ఎంపీలంతా మౌనముద్ర దాల్చి సభలో కూర్చుండిపోయారు. అయతే సిగ్గు చేటు ఏంటంటే..  ఈ చర్యను తెదేపా వారు సమర్థించుకోవడమే అని ప్రజలు దెప్పిపొడుస్తున్నారు. తాము మిత్రపక్షం గనుక.. మిత్రధర్మం పాటించి.. ప్రధాని ప్రసంగం సమయంలో గౌరవంగా కూర్చున్నామని జయదేవ్ అంటున్నారు. అప్పటిదాకా చేసిన పోరాటాలకు స్పందించి, ప్రధాని ప్రసంగంలో ఏమైనా సమాధానం వస్తుందేమో అనే ఉద్దేశంతో నిశ్శబ్దం పాటింనట్లు చెబుతున్నారు.  అయితే అదేసమయంలో వైకాపా సైలెంట్ గా ఉండడం మాత్రం తప్పు అంటున్నారు.

తాము సైలెంట్ కావడానికి వారి వద్ద కారణాలున్నాయి.. పక్క పార్టీ విషయంలో మాత్రం అదే జరిగితే వారి వద్ద ఆరోపణలున్నాయి. ఇదెక్కడి రాజనీతి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి పార్లమెంటు సాక్షిగా జరిగిన పోరాటంలో తెదేపా విభజన హామీలు అనే ఒకే పదానికి పరిమితం అయితే.. వైకాపా మాత్రం.. ప్రత్యేకహోదా అంశాన్ని కూడా పదేపదే లేవనెత్తుతూ... అధికార తెలుగుదేశం కంటె ఎక్కువగా ప్రజల గుర్తింపు తెచ్చుకుంది. దీన్ని ఓర్వలేక.. ప్రధాని ప్రసంగం సమయంలో  తాము గౌరవించడం సంస్కారం అని, వారు గౌరవించడం తప్పు అని జయదేవ్ చెప్పడం ప్రజలకు బోధపడ్డం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ మీద ఇలాంటి సంకుచితమైన, అనుచితమైన అసంబద్ధమైన వ్యాఖ్యలను తెదేపా ఇప్పటికైనా మానుకోకపోతే.. ముందు వారి పరువే పోతుందని.. వైకాపా వైపు ఒక వేలు చూపించేలోగా.. తతిమ్మా నాలుగువేళ్లు వారి తప్పునే చూపిస్తున్నాయని తెలుసుకోవాలని ప్రజలు అంటున్నారు.
Tags:    

Similar News