బాబు వ్యూహం మారింది.. నాని ప్లేస్ లో ఆ నేత‌!

Update: 2018-07-20 04:30 GMT
విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పేందుకు వీలుగా ఏపీ అధికార‌ప‌క్షం తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్ట‌టం తెలిసిందే. మోడీ స‌ర్కారు మీద ప‌లు పార్టీలు అవిశ్వాసం పెట్టినా.. వ్యూహాత్మ‌కంగా టీడీపీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాసాన్ని ఓకే చేస్తూ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీ కేశినేని నానితో మాట్లాడించాల‌ని టీడీపీ అధినేత  చంద్ర‌బాబు భావించారు. కానీ.. చివ‌ర్లో వ్యూహం మారింది. నానికి ఉండే లాంగ్వేజ్ స‌మ‌స్య‌ను అమెరికాలో ఉన్న‌త విద్యాభాస్యం చేసిన ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌తో మాట్లాడించాల‌ని నిర్ణ‌యించారు.

ఆ మ‌ధ్య‌న మిస్ట‌ర్ ప్రైమ్ మినిస్ట‌ర్ అంటూ హుందాగా మాట్లాడుతూనే.. క‌త్తితో కోసిన‌ట్లుగా క‌రుకుగా మాట్లాడి అంద‌రి మ‌న‌సుల్ని దోచుకున్న ఎంపీ జ‌య‌దేవ్ చేత మాట్లాడిస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న చేశారు. దీనికి త‌మ్ముళ్లు కూడా ఓక అన్నారు. అయితే.. మొద‌ట ప్ర‌క‌టించిన‌ట్లు నాని కాకుండా గ‌ల్లా జ‌య‌దేవ్ పేరును తీసుకురావ‌టంతో.. ఆయ‌న చిన్న‌బుచ్చుకోకుండా ఉండేందుకు ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.

దీనికి నాని ఓకే చెప్ప‌టంతో గ‌ల్ల జ‌య‌దేవ్ మాట్లాడేందుకు డిసైడ్ చేశారు. మొద‌ట్లో చ‌ర్చ‌ను ప్రారంభించిన నేతే.. చివ‌ర్లోనూ కంక్లూడ్ చేసే వీలు ఉండ‌టంతో.. జ‌య‌దేవ్ అయితే ఇంగ్లిషులో దంచి కొడ‌తార‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇక‌.. త‌మ‌కు ఇచ్చిన 13 నిమిషాల స‌మ‌యం స‌రిపోద‌ని.. త‌మ వాద‌న‌ను వినిపించేందుకు మ‌రికొంత టైం కావాల‌ని డిమాండ్ చేయాల‌న్న మాట‌ను టీడీపీ ఎంపీల‌కు బాబు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

అవిశ్వాసంపై చ‌ర్చ ప్ర‌తిష్ఠాత్మ‌క‌మ‌ని.. ఐదు కోట్ల మంది ఆంధ్రులు పార్ల‌మెంటు వైపు చూస్తుంటార‌ని.. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్న సూచ‌న‌ను ఏపీ టీడీపీ ఎంపీల‌కు బాబు చెప్పారు. మ‌రి.. బాబు ఇంత పెట్టుకున్న ఆశ‌ల్ని ఎంపీ జ‌యదేవ్ ఎంత‌వ‌ర‌కు నెర‌వేరుస్తారో చూడాలి.
Tags:    

Similar News