ధోనీ బ‌ర్త్ డే వేళ పిక్ మార్చిన‌ గంభీర్.. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్ వార్‌!

Update: 2021-07-09 01:30 GMT
అప్పుడెప్పుడో 1983లో భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్ సాధించింది. ఆ త‌ర్వాత మూడు ద‌శాబ్దాల వ‌ర‌కు మ‌ళ్లీ ఆ క‌ల నెర‌వేర‌లేదు. దీంతో.. క్రికెట్ ఫ్యాన్స్ ఆక‌లి అంతా ఇంతా కాదు. ఎప్పుడు వ‌ర‌ల్డ్ క‌ప్ కొడుతుందోన‌ని క‌ళ్ల‌లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారంటే అతిశ‌యోక్తి కాదు. 2007లో మ‌ధ్య‌లోనే తిరిగొచ్చార‌ని క్రికెట‌ర్ల ఇళ్ల‌ముందు నానా ర‌చ్చ చేశారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో 2011 ప్ర‌పంచ క‌ప్ ను ఇండియా ద‌క్కించుకుంది.

ఆ స‌మ‌యంలో క్రికెట్ ప్రేమికుల ఆనందం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దేశం మొత్తం అన్ని పండ‌గ‌ల‌ను క‌లిపి ఒకేసారి సెల‌బ్రేట్ చేసుకుంది. ఇన్నింగ్స్ చివ‌ర‌లో సిక్స‌ర్ తో ధోనీ భార‌త్ కు వ‌ర‌ల్డ్ క‌ప్ అందించిన ఘ‌ట్టం ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయింది. ఇప్ప‌టికీ.. 2011 ప్ర‌పంచ‌క‌ప్ అంటే ధోనీ కొట్టిన‌ సిక్స‌రే గుర్తొస్తుంది. అంత‌లా త‌న‌దైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు ధోనీ.

కీల‌క‌మైన విరాట్ కోహ్లీ వికెట్ ప‌డిన త‌ర్వాత అనూహ్యంగా ధోనీ మైదానంలోకి అడుగు పెట్టాడు. నిజానికి బ్యాటింగ్ రెగ్యుల‌ర్ ఆర్డ‌ర్ ప్ర‌కారం.. ఆ స‌మ‌యంలో యువ‌రాజ్ సింగ్ రావాల్సి ఉంది. కానీ.. యువ‌రాజ్ ను ఆపి, సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకొని ఆర్డ‌ర్లో ముందుకు వ‌చ్చేశాడు ధోనీ. అప్ప‌టికీ.. విజ‌యం ఇరు ప‌క్షాల‌కూ స‌మంగా ఉంది. ఇంకా చెప్పాలంటే.. ఒక మెట్టు శ్రీలంక వైపే ఉన్న‌ట్టుగా అనిపిస్తున్న స‌మ‌యం అది.

ఇలాంటి స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన ధోనీ.. త‌న‌దైన ఆట‌తీరుతో చెల‌రేగిపోయాడు. బంతుల‌కు, ర‌న్ రేట్ మ‌ధ్య బ్యాలెన్స్ ను స‌రిచేసుకుంటూ.. వికెట్ కాపాడుకుంటూ అసాధార‌ణ గేమ్ ఆడాడు ధోనీ. 79 బంతుల్లోనే 91 ప‌రుగులు చేసి టీమిండియాకు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యం అందించాడు. దీంతో.. 2011 ప్రపంచ క‌ప్ అంటే.. ధోనీ ఇన్నింగ్స్ మాత్ర‌మే గుర్తుకు వ‌చ్చేలా మారిపోయింది ప‌రిస్థితి.

కానీ.. ఇదే మ్యాచ్ లో సెహ్వాగ్ డ‌కౌట్‌, స‌చిన్ 18 ప‌రుగుల‌తో వెనుదిరగ‌డంతో.. పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయిన జ‌ట్టును అద్భుత‌మైన ఆట‌తీరుతో గ‌ట్టెక్కించాడు ఓపెనర్ గౌత‌మ్ గంభీర్‌. 97 ప‌రుగులు చేసి తృటిలో సెంచ‌రీ కోల్పోయాడు. అయిన‌ప్ప‌టికీ.. రెండు బ‌ల‌మైన వికెట్లు కోల్పోయిన వేళ గంభీర్ చేసిన 97 ప‌రుగులే టీమిండియా ఇన్నింగ్స్ ను నిల‌బెట్టాయ‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. అత్యంత విలువైన ప‌రుగుల‌తో మ్యాచ్ ను నిల‌బెట్టిన గంభీర్ మ‌రుగున ప‌డిపోయాడ‌ని చెప్పొచ్చు. అస‌లు.. గంభీర్ 97 ప‌రుగులు చేశాడ‌న్న సంగ‌తే మ‌రిచిపోయారు అంద‌రూ. ధోనీ మేనియా అలా క‌ప్పేసింది.

ఈ విష‌యాన్ని ఆ త‌ర్వాత అంద‌రూ మ‌రిచిపోయారు. కానీ.. గంభీర్ మాత్రం మ‌రిచిపోలేదు. ఒక‌టీ రెండు కాదు.. ఏకంగా ప‌దేళ్లు గ‌డిచినా ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకున్నాడు. అంతేకాదు.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించుకున్నాడు. నాటి ఇన్నింగ్స్ కు సంబంధించిన‌ప్ప‌టి త‌న ఫొటోను సోష‌ల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. నిన్న (జులై 7) పాత పిక్ ను చేంజ్ చేసి, ఈ ఫొటోను పెట్టుకున్నాడు.

అయితే.. సాధార‌ణ రోజుల్లో ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు.. ఒక సంద‌ర్భాన ఇది పోస్టు చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో కాక రేగింది. అదేమంటే.. నిన్న ధోనీ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా మాజీ క్రికెట‌ర్ల నుంచి ఫ్యాన్స్ వ‌ర‌కు అంద‌రూ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇలాంటి స‌మ‌యంలో గంభీర్.. నాటి సంగ‌తిని గుర్తు చేసేలా పిక్ పెట్ట‌డంతో.. అంద‌రికీ ఏం జ‌రిగిందో గుర్తొచ్చింది.

దీనిపై మ‌హీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ధోనీపై అసూయ‌తోనే గంభీర్ ఈ విధంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని అన్నారు. త‌న‌కు త‌గిన గుర్తింపు ద‌క్క‌లేద‌నే అక్క‌సు ఇంకా త‌న‌లో ఉంద‌ని, ఆ కార‌ణంగానే.. స‌రిగ్గా ధోనీ పుట్టిన రోజు వేళ ఇలా బ‌య‌ట పెట్టుకున్నాడ‌ని అన్నారు. అటు గంభీర్ ఫ్యాన్స్ కూడా కౌంట‌ర్లు వేశారు. గంభీర్ 97 ప‌రుగులు కొట్ట‌క‌పోతే ఖ‌చ్చితంగా మ్యాచ్ పోయేద‌ని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News